రజినీకాంత్ లాంటి హీరో ప్రమోషన్ కు రావాల్సిన పనిలేదు. ఆయన సినిమా చేస్తే చాలు అభిమానులు రెడీగా ఉంటారు చూడ్డానికి. ఇక కామన్ ఆడియన్స్ కూడా రజినీ కోసం వేచి చూస్తుంటారు. కానీ టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా..! ఈయనకు ఇప్పుడు కష్టకాలం నడుస్తుంది. గత మూడు సినిమాలు తెలుగులో రజినీకాంత్ కు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. విక్రమసింహాతో పాటు లింగా..
కబాలి కూడా ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఇప్పుడు ఈయన సినిమా అంటే తెలుగులో ఎందుకు అన్నట్లు సైలెంట్ అయిపోతున్నారు బయ్యర్లు. ఇప్పుడు కాలాను కూడా తనకు తెలియిన ఎన్వీ ప్రసాద్.. దిల్ రాజు నుంచి విడుదల చేయిస్తున్నాడు రజినీకాంత్. లైకా వాళ్లే ఇక్కడ కూడా సొంతంగా విడుదల చేయాలనే అనుకున్నా.. చివరి నిమిషంలో ఈ ఇద్దరూ వచ్చారు. ఇక తెలుగు ప్రమోషన్ కు ఏకంగా రజినీకాంత్ వచ్చాడు. రావడమే కాదు.. తెలుగు ప్రేక్షకుల నుంచి తనకు వచ్చిన అభిమానాన్ని మాటల్లో చెప్పి ఆనందపడిపోయాడు. తాను ఎప్పుడూ తెలుగు వాళ్ల రుణం తీర్చుకోలేనని చెప్పాడు ఈ సూపర్ స్టార్. అంతేకాదు..
తన సినిమాలను ఇక్కడ సినిమాల మాదిరే ఆదరిస్తుండటం చూసి తానెంత అదృష్టవంతున్నా అనిపిస్తుందని చెప్పాడు రజినీకాంత్. ఈయన మాటలతో తెలుగు ఆడియన్స్ కూడా బాగానే కన్విన్స్ అయ్యారు. ఇప్పటి వరకు కాలాపై పెద్దగా ఆసక్తి లేదు కానీ రజినీ రాకతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. ఒక్కసారి ప్రమోషన్ కు వస్తేనే ఇలా ఉంది పరిస్థితి.. ఇక విడుదలకు ముందే మరొక్కసారి ఆయన అన్ని ఛానెల్స్ కు.. వెబ్ సైట్లకు కానీ ఇంటర్వ్యూలు ఇచ్చాడంటే దెబ్బకు కాలా ఎక్కడికో వెళ్లిపోతుంది. మరి చూడాలిక.. ఈ మధ్య కాలంలో ఏ సినిమా కోసం ఇంతగా కష్టపడలేదు రజినీకాంత్. మరి ఇప్పుడు ఈ చిత్రం కోసం పడుతున్న కష్టానికి ఫలితం ఎలా ఉంటుందో జూన్ 7న తేలనుంది.