హాయిగా సినిమాలు చేసుకోక రజినీకాంత్ కు ఎందుకు ఈ రాజకీయాలు..? అయినా సినిమా వాళ్లకు ఏం తెలుసు రాజకీయాలు అంటూ కొన్నాళ్లుగా రజినీపై కొన్ని విమర్శలు.. దాడులు జరుగుతూనే ఉన్నాయి తమిళనాట. దీనికి స్వయంగా సూపర్ స్టారే సమాధానం ఇచ్చాడు. తను ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నాను అనే సంగతి పూర్తిగా చెప్పేసాడు రజినీకాంత్. తాజాగా ఈయన ఎంజిఆర్ ఎడ్యుకేషనల్ ఇన్సిట్యూట్ లో ఎంజిర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చారు. అక్కడే తన రాజకీయాల గురించి వివరంగా చెప్పాడు సూపర్ స్టార్. జయలలిత ఉన్నన్ని రోజులు రాజకీయాలంటే ఆసక్తి లేదని చెప్పిన రజినీ.. ఆమె చనిపోయిన తర్వాత రావడంతో జయకు భయపడ్డాడు అనే అర్థం వచ్చేలా కమెంట్ చేస్తున్నారంతా. దీనికి ఆన్సర్ ఇచ్చాడు రజినీకాంత్. తను జయలలితకు భయపడ్డాను అనుకోవడం తప్పని.. జయ నిజమైన నాయకురాలని.. ఆమె ఉన్నపుడు తన అవసరం రాష్ట్రానికి లేదనిపించిందని చెప్పాడు సూపర్ స్టార్.
అందుకే ఆమె ఉన్నపుడు రాజకీయాల గురించి ఆలోచించలేదని చెప్పాడు రజినీ. ఆమెతో ఎప్పుడు 1996లో ఓ వివాదం జరిగిన మాట వాస్తవమే అయినా.. తర్వాత ఎప్పుడూ జయకు తాను వ్యతిరేకంగా వెళ్లలేదని గుర్తు చేసుకున్నాడు రజినీకాంత్. జయ చనిపోయిన తర్వాత తమిళనాట రాజకీయ శూన్యత ఏర్పడిందని.. అది పూడ్చడానికే తను వచ్చానని చెప్పాడు రజినీ. తనకు ఎంజిఆర్ లా ప్రజలకు మంచి పాలన అందించాలనే లక్ష్యంతోనే తను రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిపారు రజినీకాంత్. కరుణానిధి కూడా చాలా బలమైన నాయకుడు అని.. అధికారం లేకపోయినా కొన్నేళ్లుగా పార్టీని సమర్ధవంతంగా నడపటం అంత ఈజీ కాదని.. అది చేసి చూపిస్తున్నాడని తెలిపాడు రజినీ. మొత్తానికి ఇప్పటి రాజకీయ నాయకులు సరిగ్గా పని చేయడం లేదు కాబట్టే తాను దిగానంటున్నాడు ఈ అరుణాచలం. మరి సినిమాల్లో కుమ్మేసిన రజినీ.. రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తాడో చూడాలిక..!