ఒకప్పుడు ఎలా ఉన్నాడు అనేది కాదు కానీ ఇప్పుడు ఏంటి అనేది కావాలి అందరికీ. ఇండస్ట్రీలో గతం కంటే ప్రస్తుతానికి వ్యాల్యూ ఎక్కువ. పది ఫ్లాపులు ఇచ్చినా ఒక్క హిట్ ఇస్తే నువ్వే కావాలంటారు. అలా కాకుండా పది హిట్లు ఇచ్చి ఒక్క ఫ్లాప్ ఇచ్చినా కూడా దూరం దూరం అంటారు. ఇప్పుడు పూరీ పరిస్థితి ఇలాగే ఉంది. ఈయన్ని వరస ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. ఏ హీరో కూడా నమ్మడం లేదు. ఒకప్పుడు ఈయన కథ రాస్తే తిరుగుండేది కాదు..
కానీ ఇప్పుడు ఈయన కథంటే భయపడుతున్నారు హీరోలు. మొన్న ఆకాశ్ తో చేసిన మెహబూబా కూడా డిజాస్టర్ అయిపోయింది. అసలు ఇప్పుడు ఏం చేస్తే పూరీ ఈ మత్తులోంచి బయట పడతాడో అర్థం కావడం లేదు అభిమానులకు కూడా. అయితే పూరీ ఊహలు మాత్రం మరోలా ఉన్నాయి.
ఈయన ఇప్పుడు సొంత కథలు రాయడం మానేసి.. ఇతర రైటర్స్ రాసిన కథల వైపు వెళ్తున్నాడు. ఈయన దర్శకుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాదు.. రైటర్ గా మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. మంచి కథలు వస్తే ఇప్పటికీ పూరీలో సత్తా తగ్గలేదు. టెంపర్ అది నిరూపించింది. ఆ తర్వాత తాను సొంతంగా రాసుకున్న కథలే పోయాయి. దాంతో ఇప్పుడు మరో రైటర్ రాసిన కథ కోసం చూస్తున్నాడు ఈ దర్శకుడు. ఇది బన్నీతో చేయాలని చూస్తున్నాడు.
అల్లు అర్జున్ కూడా ఇప్పుడు ఏ సినిమాకు కమిట్ కాలేదు. విక్రమ్ కే కుమార్ సినిమా కూడా ఆగిపోయేలా ఉంది. దాంతో బన్నీని లైన్ లో పెడుతున్నాడు ఈ దర్శకుడు. గతంలో దేశముదురు.. ఇద్దరమ్మాయిలతో సినిమాలు చేసారు పూరీ, బన్నీ. ఇప్పుడు మూడోసారి జోడీ కట్టాలని చూస్తున్నారు. మరి ఇది వర్కవుట్ అవుతుందా..? మరో కథ తీసుకొచ్చినా బన్నీ ఒప్పుకుంటాడో లేదో చూడాలిక..!