బాలయ్య సినిమా ఎట్టకేలకు మొదలైంది. ఎప్పుడో మార్చ్ లో ఎన్టీఆర్ బయోపిక్ కు ముహూర్తం పెడితే ఇప్పుడు పట్టాలెక్కింది సినిమా. అక్టోబర్ లో ఈ సినిమా మొదలు కానుందని ముందు వార్తలు వినిపించినా ఇప్పుడు అన్నింటికంటే ముందు తండ్రి బయోపిక్ నే పట్టాలెక్కించాడు బాలయ్య. ఈ చిత్రాన్ని తానే నిర్మిస్తున్నాడు బాలకృష్ణ. ఇందులో హీరోయిన్ గా విద్యాబాలన్ ను తీసుకొచ్చాడు క్రిష్. బసవతారకం పాత్రలో ఈమె అయితే బాగా సూట్ అవుతుందని భావించి.. బాలీవుడ్ లో తనకు ఉన్న పిఆర్ తో ఎలాగోలా ఒప్పించాడు క్రిష్.
త్వరలోనే విద్యా కూడా ఈ చిత్ర షూటింగ్ లో అడుగు పెట్టనుంది. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. మణికర్ణిక సినిమా పనులన్నీ పూర్తి కావడంతో ఇకపై పూర్తిగా క్రిష్ దృష్టంతా ఎన్టీఆర్ పైనే ఉండబోతుంది. అక్టోబర్ లో మొదలైతే టైమ్ మరీ తక్కువగా ఉంటుందని.. ముందే మొదలుపెట్టాడు క్రిష్.
ఆర్నెళ్లలో ఓ సినిమాను పూర్తి చేయడం సులభమే. అందుకే కాస్త ముందుగానే సినిమా మొదలుపెట్టాడు బాలయ్య. ఈ చిత్రంలో ఏకంగా 63 గెటప్స్ లో కనిపించబోతున్నాడు బాలకృష్ణ. దీనికోసం హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టులు వస్తున్నారు. ఇప్పటికే ఇందులో నాగేశ్వరరావ్ పాత్ర కోసం సుమంత్ ను తీసుకుంటున్నాడు క్రిష్. పోలికల విషయంలో తాతకు తగ్గ మనవడే ఈ అక్కినేని అల్లుడు. అందుకే ఈయన వైపు మొగ్గు చూపుతున్నాడు.
మరోవైపు సావిత్రి పాత్ర కోసం కీర్తిసురేష్ నే ఆశ్రయిస్తున్నాడు క్రిష్. ఈమె తప్ప ఇప్పుడు మహానటి పాత్రలో మరో హీరోయిన్ ను ఊహించడం సాధ్యమయ్యే పని కాదు. దాంతో కాస్త కష్టమైనా పర్లేదు కీర్తినే ఒప్పించే పనిలో ఉన్నాడు క్రిష్. వాళ్ళతో పాటు మోహన్ బాబు కూడా ఈ బయోపిక్ లో ఉన్నాడు. ఓ కీలకపాత్ర కోసం కలెక్షన్ కింగ్ ను సంప్రదించినట్లు తెలుస్తుంది. అన్నయ్య బయోపిక్ కావడంతో ఆనందంగా మోహన్ బాబు ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడని తెలుస్తుంది. సంక్రాంతికి విడుదల కానుంది ఈ చిత్రం.