నెలకు అయిదు లక్షల వేతనమిచ్చే బంగారు బాతు లాంటి ఉద్యోగాన్ని వదులుకొని.. సినిమా పట్ల పేషన్ తో, పిచ్చితో.. మెగా ఫోన్ పట్టిన వ్యక్తి గోవర్ధన్ గజ్జల. ఓయూలో బాచిలర్స్ చేసి.. అమెరికాలో మాస్టర్స్ చేసిన గోవర్ధన్ ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకొని.. అక్కడే ఆరంకెల జీతం అందుకొంటూ హాయిగా ఉంటున్నప్పటికీ.. చిన్నప్పటినుంచి కలలు గంటూ వచ్చిన సినిమా రంగం పట్ల ఎడ తెగని మక్కువతో.. లాస్ ఏంజెల్స్ లోని యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియాలో ఫిలిం మేకింగ్ కోర్స్ కోర్స్ చేశాడు. ఆపై పలు షార్ట్ ఫిలిమ్స్ తీసి శభాష్ అనిపించుకుని.. ఆ ప్రశంసలు ఇచ్చిన ప్రోత్సాహంతో.. ఉద్యోగాన్ని వదులుకొని.. తన మిత్రులతో కలిసి స్వీయ దర్శకత్వం మరియు నిర్మాణంలో “ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం” రూపొందించాడు.
ఇందులో నటించినవారు, ఈ చిత్రానికి పని చేసినవారు అందరూ ఎన్నారై లు కావడం.. దాదాపుగా సినిమా మొత్తం అమెరికాలో షూటింగ్ జరుపుకోవడం గమనార్హం. చంద్రకాంత్-రాధికా మెహరోత్రా- పల్లవి డోరా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, తులసి, జెమిని సురేష్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న “ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం” ఈనెల 17న విడుదలవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని.. దర్శక నిర్మాత గోవర్ధన్ గజ్జల మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ చిత్రాన్ని ఇప్పటికే ఇటు హైదరాబాద్ లో.. అటు అమెరికాలో పలు దఫాలుగా పలువురు ప్రముఖులు, సన్నిహితులు, మిత్రులకు చూపించామని.. చూసినవాళ్లంతా.. సినిమా చాలా బాగుందని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారని గోవర్ధన్ తెలిపారు. అలా తమ సినిమా చూసిన ప్రముఖుల్లో ఒకరైన ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ (గోపి) “ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం” చిత్రం విడుదల విషయంలో తమకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటామని గోవర్ధన్ చెప్పారు. ఈ సినిమా కోసం పర్సనల్ గా.. ప్రొఫెషనల్ గా తాను చాలా త్యాగాలు చేశానని.. అయితే సినిమా అవుట్ ఫుట్ చూసుకున్నాక.. తాను పడిన కష్టాలన్నీ మర్చిపోయానని ఆయన అన్నారు. హీరో హీరోయిన్స్ చంద్రకాంత్, రాధికా, పల్లవిల నటన, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ సినిమాకి ఆయువుపట్టుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొంది.. ఈనెల 17న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతున్న “ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం” అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తుందని దర్శకనిర్మాత గోవర్ధన్ ఆశాభావం వ్యక్తం చేశారు!!