భావ స్వాతంత్ర్యం.. స్వతంత్ర్య భారతదేశం.. స్వేచ్ఛాహక్కు.. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా..? పద్మావతి సినిమాకు పట్టిన గతి చూస్తుంటే ఇవన్నీ వద్దన్నా మాట్లాడుకోవాలనిపిస్తుంది మరి. అన్నీ అనుకున్నట్లు జరుగుంటే ఈ పాటికే సినిమా థియేటర్స్లో ఉండేది. కానీ రాలేదు. ఏం చేస్తాం మరి.. దర్శకుల పరిస్థితి అంత దారుణంగా ఉంది మరి. ఈ రోజుల్లో ఓ సినిమాను తీయడం కంటే.. దాన్ని రిలీజ్ చేయడమే కష్టం అంటారు. చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా నిజంగా విడుదల చేయడమే కష్టం. తొమ్మిది నెలలు అమ్మ కడుపులో మోయడం కంటే.. బిడ్డ బయటికి రావడమే చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు సినిమాల పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకే భారీ సినిమాలకు ముందే ఓ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటున్నారు దర్శకులు. ఇప్పుడు పద్మావతి సినిమా విషయంలో జరుగుతున్న రచ్చ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ చిత్రం విడుదల కానివ్వమంటూ కొందరు భీష్మించుకు కూర్చున్నారు. వాళ్లు ఇంకే పని పెట్టుకోకుండా.. కేవలం ఇదే పనిపై ఉన్నారు. వాళ్ల బారి నుంచి సినిమాను తప్పించలేకపోతున్నాడు దర్శకుడు భన్సాలీ కూడా. ఎక్కడో ఉన్న బ్రిటన్ లో సినిమా విడుదలకు క్లియరెన్స్ వచ్చింది కానీ మన దగ్గర మాత్రం పద్మావతిని తొక్కి పెట్టేసారు. డిసెంబర్ 1న పద్మావతి విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే అన్నీ సిద్ధం చేసుకున్నాడు భాన్సాలీ. కానీ చివరి నిమిషంలో అన్నీ చెదిరిపోయాయి. ఈ చిత్రానికి ఇప్పటి వరకు సెన్సార్ కూడా పూర్తి కాలేదు. డిసెంబర్ లోనే వస్తుందంటున్నారు కానీ ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు. పరిస్థితి చూస్తుంటే అసలు పద్మావతి 2017లో వస్తుందా అనే అనమానాలు కూడా వస్తున్నాయి.
డిసెంబర్ మొదలై కూడా ఇప్పటికే వారం రోజులు గడిచిపోయింది కానీ ఇప్పటికీ పద్మావతి గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఇలాంటి తిప్పలేవో ముందే వస్తాయని ఊహించాడో ఏమో కానీ పద్మావతికి 140 కోట్ల ఇన్సూరెన్స్ చేయించాడు దర్శకుడు భన్సాలీ. ఒకవేళ ఏ కారణంతోనైనా సినిమా నష్టపోతే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 90 కోట్లు రిటర్న్స్ వచ్చేలా ఇన్సూరెన్స్ చేయించాడు దర్శకుడు. గతంలో కర్ణిసేన వచ్చి రాజస్థాన్ షూటింగ్ లో సెట్ తగలబెట్టినపుడు కూడా 3 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించాడు భన్సాలీ. అప్పుడు అవి క్లైమ్ అయ్యాయి. ఇప్పుడు కూడా విడుదలకు ఏ మాత్రం పరిస్థితులు సహకరించకపోయినా.. నష్టపోయినా 100 కోట్లైతే ఎక్కడికి పోవు. మొత్తానికి తన జాగ్రత్తలో తాను ఉన్నాడు ఈ దర్శకుడు.