అన్నీ అనుకున్నట్లు జరుగుంటే ఈ పాటికి పద్మావతి సినిమా వచ్చుండేది. కానీ రాలేదు. ఇండియాలో ఇప్పుడు ఓ దర్శకుడికి ఎంత వ్యాల్యూ ఉంది.. అతడి క్రియేటివిటీకి ఎంత విలువ ఉందో ఇప్పుడు పద్మావతికి పట్టిన గతి చూస్తుంటేనే అర్థమైపోతుంది. సినిమా తీస్తే అడ్డుకుంటారా.. విడుదల కానీవ్వకుండా రచ్చ చేస్తారా.. అందులో నటిస్తే చంపేస్తారా.. ఇవన్నీ మనం అడుగుతున్న ప్రశ్నలు కావు.. పద్మావతి సినిమాను అడ్డుకున్న వాళ్లను కోర్ట్ అడుగుతున్న ప్రశ్నలు. కానీ అక్కడున్న వాళ్లకు న్యాయస్థానం అంటే కూడా గౌరవం ఉందో లేదో మరి..! అందుకే ధర్మస్థానం ఇంతగా అరుస్తున్నా నోరు మెదపకుండా కూర్చున్నారు. పద్మావతి సినిమాను ఇప్పుడే కాదు.. ఎప్పటికీ విడుదల కానివ్వమంటూ భీష్మించుకు కూర్చున్నారు. డిసెంబర్ 1న పద్మావతి విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే అన్నీ సిద్ధం చేసుకున్నాడు భాన్సాలీ. కానీ చివరి నిమిషంలో అన్నీ చెదిరిపోయాయి. ఈ చిత్రానికి ఇప్పటి వరకు సెన్సార్ కూడా పూర్తి కాలేదు. ఇన్నాళ్లూ డిసెంబర్ లోనే వస్తుందనే నమ్మకం ఉండేది.. ఇప్పుడు అది కూడా పోయింది.
ఈ విషయంపై ఇప్పుడు దీపిక కూడా మాట్లాడటం లేదు. ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం జరుగుతుందని తెలుస్తుంది. దర్శకుడు భన్సాలీనే దీపికను ఈ సినిమాపై నోరు మెదపొద్దని చెప్పినట్లు తెలుస్తుంది. దీపిక మాత్రమే కాదు.. రణ్ వీర్ సింగ్ కానీ, షాహిద్ కపూర్ కానీ పద్మావతిపై ఏ మాత్రం నోరు జారడం లేదు. దానికి కారణం కూడా భన్సాలీనే. ఈయన తన సినిమాపై మౌన పోరాటం చేస్తున్నాడు. ఇండియాలో ఓ దర్శకుడికి ఉండే విలువ ఇంతేనా అంటూ న్యాయస్థానాన్నే తన మౌనంతో ప్రశ్నిస్తున్నారు. రోడ్డెక్కి రచ్చ చేయకుండా.. సింపుల్ గా తాను చేసిన సినిమాను ఇంకా బాక్సు ల్లోనే భద్రంగా దాచేస్తున్నారు. అందుకే భన్సాలీతో పాటు దీపిక కూడా పద్మావతి వివాదంపై నోరు మెదపడం లేదు.
ఈ చిత్రం 2018కి పోస్ట్ పోన్ అయింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరిలో సినిమాను సెన్సార్ చేయించి.. ఫిబ్రవరి 9న విడుదల చేయాలని చూస్తున్నాడు భన్సాలీ. ఎందుకంటే అప్పటి వరకు మంచి రిలీజ్ డేట్ కూడా లేదు కదా మరి. అన్ని భాషల్లోనూ కలెక్షన్లు ముఖ్యమే కాబట్టి అన్ని చోట్లా ఒకేలా విడుదలయ్యేలా చూసుకుంటున్నాడు ఈ దర్శకుడు. అందుకే కాస్త ఆలస్యమైనా పర్లేదు కానీ మంచి విడుదల తేదీతోనే రావాలని కోరుకుంటున్నాడు భన్సాలీ. కానీ ఎవరేం అన్నా ఇప్పటికే పద్మావతికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎంత ఇన్స్యూరెన్స్ చేయించినా కూడా ఈ చిత్రం విషయంలో నష్టం అయితే తప్పనిసరి అని తేలిపోయింది. మరి అది ఏ స్థాయిలో ఉంటుందనేది త్వరలోనే తేలనుంది. మొత్తానికి చూడాలిక.. పద్మావతి ఈ ప్రపంచాన్ని ఎప్పటికి చూస్తుందో..?