పవన్ కళ్యాణ్ మెల్లమెల్లగా రాజకీయాలకు చేరువవుతున్నాడు. గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్లగలం గానీ నీళ్లైతే తాగించలేం కదా.. ఇప్పుడు పవన్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఆయనకు సినిమాలంటే ఇష్టం లేదు. ఏదో అప్పుడొక్కటి ఇప్పుడొక్కటి చేస్తాడే గానీ ఎప్పుడూ ఇక్కడే అయితే ఉండడు. ఆసక్తి లేకుండా సినిమాలు చేస్తుంటే ఎలా ఉంటుందో ఫలితం గత మూడు సినిమాలతో అర్థమైపోయింది. అజ్ఞాతవాసి అయితే ఇందులో పీక్స్. ఈ చిత్రం ఏకంగా 70 కోట్ల నష్టాలు తీసుకొచ్చేలా ఉంది. దాంతో ఇకపై సినిమాలకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయిపోయాడు పవన్ కళ్యాణ్. రాజకీయ కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. 2019 ఎలక్షన్స్ లో పవన్ పోటీ చేయడానికి ఫిక్సైపోయాడు. దానికి వ్యూహ రచనలు ఇప్పట్నుంచే మొదలు పెట్టాడు. ఇందులో భాగమే రాజకీయయాత్ర. పాదయాత్ర చేయడానికి కూడా పవన్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. దీనికి ఆంజనేయ స్వామినే సాక్ష్యంగా పెట్టుకున్నాడు పవర్ స్టార్.
ఇప్పటి వరకు చరిత్రలో పాదయాత్ర చేసిన చాలామంది రాజకీయ నాయకులు బాగానే సక్సెస్ అయ్యారు. రాజశేఖర్ రెడ్డి.. చంద్రబాబు లాంటి వాళ్లకి ఈ పాదయాత్ర ఏకంగా సిఎం సీట్ తీసుకొచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నాడు. పక్కవాళ్లు వద్దంటున్నా.. ఇబ్బందులు వస్తాయని చెబుతున్నాడు వినే మూడ్ లో పవన్ లేనట్లు సమాచారం. దానికి ముందు రాజకీయ యాత్ర కూడా చేస్తున్నాడు పవన్. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి గుడి నుంచే పవన్ యాత్ర మొదలు కానుంది. తెలంగాణలోని మూడు జిల్లాల్లోని సమస్యలను ముందుగా తెలుసుకోనున్నాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత పూర్తిస్థాయి యాత్ర మొదలు కానుంది. ఆంజనేయస్వామిని దర్శించుకున్న తర్వాతే యాత్ర వివరాలు చెబుతానని చెప్పాడు పవర్ స్టార్.
ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు.. దాంతో పాటే తనకు బాగా జనాదరణ ఉన్న ప్రాంతాల మీదుగా ఈ యాత్ర జరగనుంది. దీన్ని బట్టే ఆయా స్థానాల్లో ఎవరెవరికి సీట్లు ఇవ్వాలనే విషయంపై కూడా పవన్ ఓ క్లారిటీ తెచ్చుకోనున్నాడు. రాజకీయ యాత్ర మొదలైంది కాబట్టి ఇకపై సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండాలని ఫిక్స్ అయిపోయాడు పవర్ స్టార్. ఇప్పట్లో సినిమాలు చేసే ఉద్దేశం కూడా పవన్ లో కనిపించట్లేదు. మైత్రి మూవీ మేకర్స్ కు ఇప్పటికే ఓ సినిమా చేయాలి.. అయితే ఏఎం రత్నం సినిమాను మాత్రం సెటిల్ చేస్తున్నాడు పవన్. ఇది ఆగిపోయింది. మొత్తానికి పవన్ ఇక రాజకీయ నాయకుడిగా మారిపోతున్నాడు.. ఈయన నుంచి సినిమాలు ఊహించడం కష్టమే..!