చేసింది మూడు సినిమాలే.. కానీ మూడు స్టార్ హీరోలతోనే చేసాడు. అందులో రెండు సినిమాలు బాగానే ఆడాయి కూడా. ఆ దర్శకుడే బాబీ ఉరఫ్ కేఎస్ రవీంద్ర. జై లవకుశ తర్వాత ఈయన కనిపించడమే మానేసాడు. వచ్చిన సక్సెస్ ను కూడా క్యాష్ చేసుకోలేని అమాయకుడు పాపం ఈ దర్శకుడు. ఎన్టీఆర్ లాంటి హీరోతో మూడు పాత్రలు చేయించి ఔరా అనిపించాడు బాబీ. జై లవకుశ తర్వాత బాబీ కోసం స్టార్ హీరోలంతా క్యూ కడతారేమో అనుకున్నారంతా. కానీ అలాంటిదేం జరగలేదు. ఇప్పటికీ మరో సినిమా సెట్ చేసుకోలేకపోయాడు ఈ దర్శకుడు. ఎప్పటికప్పుడు ఎవరో ఓ హీరోతో సినిమా చేస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి కానీ ఏదీ కన్ఫర్మ్ కావట్లేదు.
సర్దార్ టైమ్ లో పవన్ పుణ్యమా అని బాబీని పూర్తిగా పక్కనబెట్టేసారు. అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా బాబీ ఇమేజ్ పెద్దగా దెబ్బ తినలేదు. జై లవకుశతో తానేంటో నిరూపించుకున్నాడు. పెద్దగా కొత్త కథ కాకపోయినా.. రొటీన్ కథతో జై లవకుశ సినిమాను బాబీ హ్యాండిల్ చేసిన తీరు అందరితోనూ ప్రశంసల వర్షం కురిపించింది. ఈ చిత్రం ఇంతగా ఇంపాక్ట్ చూపించిన తర్వాత కూడా బాబీని స్టార్ హీరోలు పట్టించుకోవడం లేదు. బాబీ టాలెంట్ ను కొందరు దోచేస్తున్నారనే టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. కోనవెంకట్ లాంటి స్క్రీన్ ప్లే రైటర్స్ బాబీని ఔట్ ఫోకస్ చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొన్న జై లవకుశ టైమ్ లో దర్శకుడు బాబీ కంటే అన్నిచోట్లా కోనవెంకటే కనిపించాడు. ఇక ఎన్టీఆర్ కూడా ఈ చిత్రానికి కోన బ్యాక్ బోన్ అన్నాడు.
బాబీకి సక్సెస్ కొట్టడం తెలిసినా.. దాన్ని క్యాష్ చేసుకునే పద్దతి ఇంకా అబ్బలేదంటారు ఇండస్ట్రీలో కొందరు. ఈయనకు టాలెంట్ ఉంది కానీ స్టార్ డైరెక్టర్ మాత్రం జీవితంలో కాలేడని ఇండస్ట్రీలో వరస విజయాలతో దూసుకు పోతున్న ఓ పెద్ద నిర్మాత అత్యంత సన్నిహితులతో అన్నాడనే వార్తలున్నాయి. ఈ మధ్యే విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తాడనే వార్తలు వినిపించినా.. ఇప్పుడు సీన్ లోకి నాగచైతన్య వచ్చాడు. అది కూడా కన్ఫర్మ్ కాదు. ఇప్పటికే చైతూ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. మారుతితో శైలజారెడ్డి అల్లుడు.. చందూమొండేటి సవ్యసాచి.. కొత్త దర్శకురాలు సౌజన్యతో ఓ సినిమా.. శివనిర్వానతో మరో సినిమా.. ఇలా ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ పూర్తయ్యేవరకు ఏ రెండేళ్లో పడుతుంది. మరి చూడాలిక.. బాబీని ఆదుకునే ఆ హీరో ఎవరో.??