ఛీ ఛీ అదేంటి.. బాలయ్యకు 9 నెలల కష్టాలేంటి అనుకుంటున్నారా..? అవును.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు బాలయ్యను 9 నెలల కష్టాలు వెంబడిస్తున్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. జై సింహా తర్వాత ఆర్నెళ్లుగా ఈయన ఖాళీగానే ఉన్నారు. ఒక్క సినిమా కూడా పట్టాలెక్కించలేదు. కానీ మూడు సినిమాలకు మాత్రం కమిటయ్యారు. దాంతో ఇప్పుడు వచ్చే తొమ్మిది నెలల్లో ఏకంగా మూడు సినిమాలు విడుదల చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాడు బాలకృష్ణ. దానికోసం రెండు పడవల ప్రయాణం కూడా చేయబోతున్నారు. రెండు పడవల ప్రయాణం ఎప్పటికైనా డేంజరే. ఎప్పుడు కాలు జారుతుందో తెలియదు.
జారిందా అంతే సంగతులు. ఇప్పుడు బాలయ్య కూడా ఇదే చేస్తున్నాడు. సినిమా రాజకీయాలు రెండు పడవలు అనుకోవద్దు. అది ఎప్పట్నుంచో చేస్తున్నాడు ఈ హీరో. కానీ ఇక్కడ రెండు పడవల ప్రయాణం అంటే ఒకేసారి రెండు సినిమాలు అని అర్థం. ఈయనిప్పుడు మూడు సినిమాలకు కమిటయ్యాడు.
ఇందులో బోయపాటి సినిమాకు ఇంకా టైమ్ ఉంది. కానీ ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్తుందని.. సంక్రాంతికి రిలీజ్ చేస్తామని దర్శక నిర్మాతలే అనౌన్స్ చేసారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వినాయక్ సినిమా ఇప్పుడు లైన్ లోకి వచ్చింది. ఈ సినిమా జులై నుంచి పట్టాలెక్కనుంది. దసరాకు విడుదల చేయాలనేది బాలయ్య ప్లాన్. సి కళ్యాణ్ ఈ చిత్రానికి నిర్మాత. వినాయక్ సినిమాతో పాటే ఎన్టీఆర్ బయోపిక్ కూడా సెట్స్ పైకి తీసుకొచ్చేలా ఉన్నాడు బాలయ్య. కుదిర్తే రెండు సినిమాలు ఒకేసారి పూర్తి చేయనున్నాడు కూడా.
ఈ రెండు సినిమాలను ఒకే టైమ్ లో బాలయ్య ఎలా బ్యాలెన్స్ చేస్తాడు..? అలా చేస్తే అసలుకే ఎసరు వస్తుంది కదా..? ఇదే ఇప్పుడు అభిమానులను టెన్షన్ పెడుతున్న విషయం. అయితే పక్కాగా ప్రతీ సినిమాకు మూడు నెలలు తీసుకుంటున్నాడు బాలయ్య. ఇప్పట్నుంచి దసరా వరకు వినాయక్.. అక్టోబర్ నుంచి సంక్రాంతి వరకు క్రిష్.. జనవరి నుంచి ఎన్నికల వరకు బోయపాటి సినిమా అంటూ టైమ్ కేటాయించాడు. మరి అంతే ప్లానింగ్ తో దర్శకులు కూడా పని పూర్తి చేస్తారేమో చూడాలిక..!