పండక్కి వచ్చిన అజ్ఞాతవాసి అడ్రస్ గల్లంతైపోవడంతో రొటీన్ సినిమా అయినా.. బాలయ్యకే ఓటేస్తున్నారు ప్రేక్షకులు. ఈయన నటించిన జై సింహాకు యావరేజ్ టాక్ వచ్చింది.. రొటీన్ సినిమా అని తీసిపారేసారు విశ్లేషకులు. కానీ ప్రేక్షకులకు మాత్రం ఇదే సినిమా ఇప్పుడు నచ్చుతుంది. ఎందుకంటే సినిమాకు వెళ్దాం అనుకున్న వాళ్లకు మరో ఆప్షన్ కూడా కనిపించట్లేదు ఇప్పుడు. దాంతో జై సింహా ఇదే అదునుగా మంచి వసూళ్లనే రాబడుతుంది. ఈ చిత్రం ఇప్పటి వరకు నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల షేర్ వసూలు చేసింది. పైగా ఈ చిత్ర బిజినెస్ కూడా చాలా తక్కువగా జరిగింది. పైసా వసూల్ దాదాపు 32 కోట్ల బిజినెస్ చేస్తే.. జై సింహా 27 కోట్లకే పరిమితం అయిపోయింది. దానికి తగ్గట్లు వసూళ్లు కూడా నెమ్మదిగా వస్తున్నాయి. తొలిరోజు 8 కోట్లకు పైగా వసూలు చేసిన జై సింహా.. తర్వాత మూడు రోజుల్లో 10 కోట్లు వసూలు చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సెంటిమెంట్ కు బాగానే కనెక్ట్ అవుతున్నారు. ప్రయాణం ఇప్పటికే సగం పూర్తయింది. మరో సగం పూర్తి కావాలి. 27 కోట్లకు ఈ చిత్రాన్ని అమ్మారు దర్శక నిర్మాతలు. అంత వసూలు చేస్తే సినిమా హిట్. సంక్రాంతి హాలీడేస్ ఇంకా రెండు రోజులు ఉండటం ఈ చిత్రానికి కలిసి రానుంది. సెలవులు పూర్తయ్యేలోపు మరో 5 కోట్లైనా తీసుకొస్తుందని నమ్ముతున్నారు నిర్మాతలు. ఇదే జరిగితే బ్రేక్ ఈవెన్ కు దాదాపు దగ్గరగా వెళ్తాడు బాలయ్య. మరి చూడాలిక.. చివరి వరకు ఏం జరుగుతుందో..?