అదేంటి.. బాలయ్య సినిమాను నాగశౌర్య మొదలు పెట్టడం ఏంటి వింతగా అనే అనుమానం అందర్లోనూ వస్తుందిగా..? నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా ఇదేనిజం. ఉగాది సందర్భంగా బాలయ్య సినిమాను నాగశౌర్య మొదలుపెట్టాడు. అదే నర్తనశాల. ఈ క్లాసిక్ టైటిల్ తో ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమా చేసాడు. ఆ తర్వాత బాలయ్య తన స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేసాడు. అప్పట్లో ఈ చిత్రానికి ముహూర్తం కూడా పెట్టాడు. సౌందర్య ఇందులో హీరోయిన్. అయితే అనుకోని కారణాలతో ఆనాటి నర్తనశాల ఆగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు నాగశౌర్య ఇదే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఉగాది కానుకగా ఈ చిత్ర టైటిల్ విడుదలైంది. శ్రీనివాస్ చక్రవర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తన సొంత బ్యానర్ లోనే ఈ చిత్రం చేయబోతున్నాడు శౌర్య.
ఒక్కసారి గెలుపు రుచికి అలవాటు పడిన తర్వాత వెనక్కి రావడం కష్టం. ఇన్నాళ్లూ నాగశౌర్యకు అది ఎలా ఉంటుందో పెద్దగా తెలియదు. వచ్చిన సక్సెస్ లు కూడా అరకొరగానే వచ్చాయి. ఈ మధ్యే ఛలోతో నిఖార్సైన విజయం అందుకున్నాడు నాగశౌర్య. అది కూడా సొంత బ్యానర్ లోనే. ఐరా సంస్థ అంటూ ఒకటి క్రియేట్ చేసి.. అందులోనే సినిమా చేసాడు శౌర్య. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. మంచి లాభాలు తీసుకొచ్చింది. బయటి బ్యానర్స్ లో చేయడం వల్ల తన సినిమాలు సరైన ప్రమోషన్ లేక పోయాయంటున్నాడు శౌర్య. ఆ మధ్య వచ్చిన జాదూగాడు.. కళ్యాణ వైభోగమే లాంటి సినిమాలు పోవడానికి కారణాలు సరైన టైమ్ లో రిలీజ్ కాకపోవడమే అంటున్నాడు శౌర్య. అందుకే సొంతబ్యానర్ లోనే వరస సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు ఈ హీరో. మొత్తానికి మరి ఛలోతో వచ్చిన సక్సెస్ ను నర్తనశాలతో కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలిక..!