ఒకటి రెండు కాదు.. 30 ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాడు బ్రహ్మానందం. టాప్ కమెడియన్ గా ఎవరూ సాధించనన్ని రికార్డులు సాధించాడు బ్రహ్మానందం. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకున్నాడు బ్రహ్మి. ఓ టైమ్ లో స్టార్ హీరోల కంటే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుని తన బొమ్మేసుకుని నడిపించిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా..
అందుకే ఇప్పుడు బ్రహ్మానందం టైమ్ టర్న్ అవుతుంది. ఈయనకు కూడా బ్యాడ్ టైమ్ మొదలైపోయింది. ఇన్నాళ్ళూ బ్రహ్మానందానికి క్రేజ్ లేకపోయినా.. ఏదో ఓ సినిమా చేసినా కూడా అందులో ఆయనకు మెయిన్ ట్రాక్ ఉండేది. ఆయనే కామెడీని లీడ్ చేసే విధంగా కొద్దో గొప్పో ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ పడేవి. ఏడాదిమొదట్లో వచ్చిన జై సింహా.. చిరంజీవి ఖైదీ నెం.150లో కూడా బ్రహ్మానందానికి చెప్పుకోదగ్గ పాత్రలే ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం సీన్ సితార అయిపోయింది. ఈ మధ్యే వచ్చిన నేలటికెట్ తో నిజంగానే బ్రహ్మి కెరీర్ నేలటికెట్ కు వచ్చేసింది.
జూనియర్ ఆర్టిస్టు కంటే దారుణంగా ఈ చిత్రంలో బ్రహ్మానందాన్ని ట్రీట్ చేసారు. కామెడీ కింగ్ కాస్తా ఇప్పుడు ఎటూ కాకుండా పోయాడు. ఒకప్పటి బ్రహ్మి అయితే ఇలాంటి పాత్ర చేయను పో అని మొహం మీదే చెప్పే వాడేమో కానీ ఇప్పుడు కాదు. ఈ సినిమా చూసిన తర్వాత బ్రహ్మి కెరీర్ ఇంక గాడిన పడటం కష్టమే అనిపించింది. డైలాగులు లేని ఓ పాత్ర ఇచ్చి.. సినిమాలో మధ్య మధ్యలో అలా చూపిస్తూ బ్రహ్మిని అవమానించినంత పని చేసాడు.
మరోవైపు ఇప్పుడు బ్రహ్మికి మరో ఆప్షన్ కూడా లేదు కాబట్టి తనకు వచ్చిన పాత్రను చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ మరీ ఇలా ఉండే పాత్రలు చేయకపోతేనే మంచిదని ఆయన్ని ఇప్పటికీ అభిమానించే వాళ్లు చెబుతున్న మాట. మరి వాళ్ల విన్నపం ఈ కామెడీ కింగ్ పట్టించుకుంటాడో లేదో..?