తెలుగు ఇండస్ట్రీతో ఆయనది 30 ఏళ్ల బంధం.. హీరోలను మించిన స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు.. పేరుకు కమెడియన్ కానీ చాలా సినిమాల్లో ఆయనే హీరో.. కేవలం ఆయన ఉన్నాడనే సినిమాలకు వెళ్లే అభిమానులు కూడా లేకపోలేరు.. ఇవన్నీ బ్రహ్మానందం గురించే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోనూ చోటు దక్కించుకున్నాడు బ్రహ్మానందం. కేవలం ఆయన అప్పియరెన్స్ తోనే కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు బ్రహ్మి ఉంటేనే సినిమా.. కానీ ఇప్పుడు బ్రహ్మి ఆ స్థాయిలో మాయ చేయలేకపోతున్నాడు. ఆయన లేకుండానే సినిమాలు బాగున్నాయంటున్నారు దర్శక నిర్మాతలు.
ఈ మధ్యే ఈయనకు కష్టకాలం మొదలైంది. సాధారణంగా సెట్స్ లో దర్శకనిర్మాతల్ని ఇబ్బంది పెడతాడనే రూమర్ బ్రహ్మిపై ఉంది. పెద్ద సినిమాలు ఏమో కానీ తన బొమ్మేసుకుని నడిపించుకునే చిన్న సినిమాల విషయంలో బ్రహ్మి ఆడిందే ఆట.. పాడిందే పాట అంటుంటారు ఫిల్మ్ నగర్ జనాలు. కానీ ఇండస్ట్రీలో బ్యాడ్ టైమ్ అనేది ప్రతీ ఒక్కరికి వస్తుంటుంది. ఇప్పుడు బ్రహ్మానందానికి కూడా అదే వచ్చినట్లు కనిపిస్తుంది. కొత్త కమెడియన్ల రాక.. ఎమ్మెస్ నారాయణ లాంటి సీనియర్ల పోక.. బ్రహ్మి కెరీర్ కు అడ్డంకిగా మారింది. దాంతో ఇప్పుడు చేసేదేం లేక.. తన జూనియర్లకు ఫోన్లు చేసి ఏం చేస్తున్నారో కనుక్కుంటున్నాడు ఈ సీనియర్ కమెడియన్.
ఇక ఈ మధ్య కాలంలో బ్రహ్మానందంకు చెప్పుకోదగ్గ పాత్రలు కూడా రాలేదు. రేసుగుర్రం తర్వాత ఆ స్థాయిలో నవ్వించిన పాత్ర లేదు. లౌక్యంలో ఉన్నంతలో కాస్త బెటర్. అఖిల్, సౌఖ్యం, సర్దార్ లాంటి సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. ఇక ఖైదీ నెం.150లో కూడా బ్రహ్మి కామెడీ పెద్దగా పేలలేదు. ఇలాంటి టైమ్ లో ఆయన ఆశలన్నీ బాలయ్య జై సింహా.. కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే సినిమాలపైనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మరో అవమానం జరిగింది. జై సింహాలో బ్రహ్మానందం సీన్స్ అన్నీ దాదాపు ఎడిట్ లో కత్తెరిస్తున్నారని తెలుస్తుంది. కథకి అడ్డుగా ఉన్నాయని బ్రహ్మి సీన్స్ కే కోత పెట్టేస్తున్నాడు దర్శకుడు. మొత్తానికి ఇప్పుడు బ్రహ్మానందం జాతకం ఎవరు మారుస్తారో చూడాలిక..!