మూడు గంటల సినిమా అంటే చిన్న విషయం కాదు. రెండున్నర గంటల సినిమాకే బోర్ కొడుతుందంటూ వంద వంకలు పెడుతున్నారు ప్రేక్షకులు. ఇక మరో అరగంట ఎక్స్ ట్రా అంటే కచ్చితంగా కథలో చాలా విషయం ఉండాలి లేదంటే మాత్రం అసలుకే మోసం తప్పదు. కంటెంట్ బలంగా ఉంటే మూడు కాదు నాలుగు గంటలైనా చూస్తారని అప్పట్లో దానవీరశూరకర్ణ సినిమా నిరూపించింది. ఆ తర్వాత చాలా సినిమాలు 3 గంటల నిడివితో వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ మధ్య అర్జున్ రెడ్డి మూడు గంటల 2 నిమిషాలతో వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఇప్పుడు రంగస్థలం సైతం మూడు గంటల నిడివితోనే వచ్చింది. ఈ చిత్రం కూడా రికార్డులు సృష్టిస్తుంది. సినిమా బాగుంటే టైమ్ ఎంత ఉన్నా చూస్తారు ప్రేక్షకులు అని ఈ చిత్రాలు నిరూపించాయి. దాంతో ఇప్పుడు ఇదే బాటలో భరత్ అనే నేను కూడా నడుస్తుందని తెలుస్తుంది. ఈ చిత్ర రన్ టైమ్ కూడా 3 గంటలే ఉందని తెలుస్తుంది.
పొలిటికల్ డ్రామా కావడంతో కొరటాల భారీగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని.. ఎక్కడా ఏ సీన్ కూడా కట్ చేయడానికి వీలు లేని విధంగా స్క్రీన్ ప్లే ఉండటంతో అలాగే సినిమా విడుదల చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఎలాగూ కథ బాగుంటే.. ఇప్పుడు రన్ టైమ్ ను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు కాబట్టి ఆ ధైర్యంతోనే ముందడుగు వేస్తున్నారు భరత్ అనే నేను టీం. కొరటాల గత చిత్రాలు మిర్చి.. శ్రీమంతుడు.. జనతా గ్యారేజ్ కూడా రెండు గంటల 40 నిమిషాల రన్ టైమ్ తో వచ్చాయి. ఇప్పుడు మరో 20 నిమిషాలు పెంచేసాడు ఈ దర్శకుడు. భరత్ అనే నేను షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.. ఎప్రిల్ 7న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ జరగనుంది.. అంటే ప్రీ రిలీజ్ వేడుక అన్నమాట. ఈ వేడుకకు ఎన్టీఆర్, చరణ్ ముఖ్యఅతిథులుగా వస్తున్నారు. మొత్తానికి చూడాలిక.. 3 గంటల సినిమాతో భరత్ ఎలాంటి మాయ చేయబోతున్నాడో చూడాలిక..!