తొలిరోజు నుంచి భరత్ అనే నేనుకు టాక్ బాగా వచ్చింది. ఎవ్వరూ కూడా సినిమాను నెగిటివ్ ప్రమోషన్ చేయలేదు. పైగా చిత్రయూనిట్ కూడా ఓ రేంజ్ లో ప్రమోషన్ చేసుకుంటున్నారు. ఎన్నడూ లేని విధంగా థియేటర్స్ కూడా తిరిగాడు మహేశ్. ఇక కేటీఆర్, జయప్రకాశ్ నారాయణ్ లాంటి రాజకీయ నాయకులు కూడా సినిమాను చూసి పొగిడారు.
ఇన్ని చేయగా ఇప్పటి వరకు ఈ చిత్రం 87 కోట్ల షేర్ సాధించింది. మరి ఇంత దానికే బ్లాక్ బస్టర్ అనేయాలా..? ఈ చిత్రానికి నిజంగా బ్లాక్ బస్టర్ అనిపించుకునే అర్హత ఉందా..? ఇది ఇండస్ట్రీ.. వ్యాపారం. ఇక్కడ సినిమాకు డబ్బులొస్తేనే హిట్.. పేరొస్తే కాదు. ఈ లెక్కన భరత్ అనే నేనుకు ఇంకా 12 కోట్లు రావాలి. అప్పుడు కానీ దాన్ని హిట్ అనలేం. తొలి వారంలో 75 కోట్ల షేర్ తెచ్చిన భరత్.. రెండో వారంలో మరో 12 కోట్లు తీసుకొచ్చాడు.
అంటే ఇప్పటి వరకు 87 కోట్లు ఈయన ఖాతాలోకి వచ్చాయి. శ్రీమంతుడును కూడా దాటేసి.. టాలీవుడ్ టాప్ 5లో చోటు దక్కించుకున్నాడు. బాహుబలిని మినహాయిస్తే.. రంగస్థలం, ఖైదీ నెం.150 దీనికంటే ముందున్నాయి. ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల్లో సినిమా హిట్టే కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భరత్ అనే నేను ఫ్లాప్ గానే మిగిలిపోనుంది.
ఇక్కడ 72 కోట్లకు అమ్మారు ఈ చిత్రాన్ని. ఇప్పటి వరకు వచ్చింది 59 కోట్లే. అంటే ఇంకా 13 కోట్లు బ్యాలెన్స్ అన్నమాట. అవి వస్తే కానీ సినిమా హిట్ కాదు. నా పేరు సూర్య వచ్చిన తర్వాత కూడా ఈ చిత్రానికి ఇవే కలెక్షన్లు ఉంటాయా అంటే అనుమానమే. ఎందుకంటే సూర్యకు కానీ టాక్ బాగొచ్చిందంటే కచ్చితంగా భరత్ కు దెబ్బ ఖాయం. మరి వాళ్లకే తెలియాలిక.. 12 కోట్ల బాకీ ఉన్న భరత్ అనే నేనును ఏ లెక్క ప్రకారం హిట్ అంటున్నారో..?