శ్రీదేవి కన్నుమూసినా ఇంకా ప్రేక్షకుల మదిలో మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. ఆమె రూపం అంత సులభంగా చెరిగిపోదు. ఆమెపై ఉన్న అభిమానం కూడా అంత త్వరగా మాసిపోదు. ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చినా కూడా శ్రీదేవి కంటే అందం మరోటి ఉండదు. అభినయంలోనూ ఆమె ఆకాశమే. కాకపోతే ఆమె కెరీర్ లో ఒక్క నేషనల్ అవార్డ్ కూడా అందుకోలేదు. ఉన్నన్ని రోజులు కూడా ఆమెకు అదొక్కటే లోటు. నటిగా ఎన్నో అవార్డులు అందుకున్నా..
ఎన్నో రికార్డులు సృష్టించినా.. ఎంతో ఎత్తుకు ఎదిగినా కూడా ఒక్క నేషనల్ అవార్డు కూడా శ్రీదేవి చెంత చేరలేదు. కనీసం వసంత కోకిల లాంటి అద్భుతమైన సినిమాలకు కూడా శ్రీదేవికి అవార్డులు రాలేదు. కానీ ఆమె కన్నుమూసిన తర్వాత శ్రీదేవికి అవార్డు వచ్చింది. గతేడాది ఆమె నటించిన మామ్ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
కూతురుకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకునే తల్లిగా ఈ చిత్రంలో ఆమె నటన ఓ అద్భుతమే. కమర్షియల్ గా సినిమా ఆడకపోయినా.. శ్రీదేవి మాత్రం నటిగా ఎన్నో రెట్లు ఎదిగింది. ఇప్పుడు ఈ చిత్రానికి గానూ 65వ జాతీయ అవార్డుల్లో శ్రీదేవిని ఉత్తమ నటిగా ప్రకటించారు. బహుశా అతిలోకసుందరికి ఇంతకంటే ఘనమైన ముగింపు కానీ.. ఇంతకంటే ఘనమైన నివాళి కానీ మరోటి ఉండదేమో..?