రవితేజ నుంచి ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు వచ్చేవి. అందులో కచ్చితంగా రెండు బాగా ఆడేవి. కానీ ఇప్పుడు అలా లేదు. ఆయన ఏడాదికి ఒకే సినిమా చేస్తున్నాడు. కానీ అది కూడా సరిగ్గా ఔట్ పుట్ రావడం లేదు. తాజాగా విడుదలైన టచ్ చేసి చూడు గురించే ఈ చర్చ అంతా. విడుదలకు ముందు ఇది అన్ని వర్గాలకు నచ్చే సినిమా అని చెప్పాడు మాస్ రాజా. కానీ చూసిన తర్వాత మాత్రం ఇలాంటి పాత చింతకాయ్ పచ్చడి కథలు గతంలో ఎన్నో చేసాడని చెబుతున్నారు అభిమానులు. ఆయన నుంచి ఊహించే సినిమా మాత్రం ఇది కాదంటున్నారు వాళ్లు. కొత్త దర్శకుడు విక్రమ్ సిరి దీన్ని తెరకెక్కించాడు. పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు.. వక్కంతం వంశీ ఇచ్చిన పాత కథనే ఆయన కాస్త మెరుగులు దిద్దాడు. విడుదల తర్వాత రవితేజ కథల ఎంపికపైనే ఇప్పుడు లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. రాజా ది గ్రేట్ తో కాస్త పర్లేదు అనిపించిన రవితేజ.. ఇప్పుడు మరోసారి రేస్ లో వెనక బడిపోయాడు. నాని లాంటి కుర్రాళ్లను తట్టుకోవాలంటే ఈయన వరస సినిమాలు చేయడం మాత్రమే కాదు.. విజయాలు కూడా అందుకోవాలి. అలా చేయకపోతే మరో రెండేళ్లలో మాస్ రాజా పూర్తిగా గాడితప్పడం ఖాయం.