ఎవరు వేయాలి.. ఎలాంటి ముద్ర వేయాలి.. ఇప్పుడు ఈ ముద్రల గోలేంటి అనుకుంటున్నారా..? ఇక్కడ ముద్ర వేయాల్సింది.. వేస్తున్నది హీరో నిఖిల్. ప్రస్తుతం ఈయన ఇదే పనిపై బిజీగా ఉన్నాడు కూడా. వరస విజయాలతో ఉన్న ఈయనకు సడన్ గా షాకులు తగిలాయి. కేశవ యావరేజ్ కావడం.. కిరాక్ పార్టీ ఫ్లాప్ కావడంతో ఇప్పుడు కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లోకి వచ్చాడు నిఖిల్. ఇప్పుడు ఈయన తమిళ సినిమా కణితన్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఒరిజినల్ ను తెరకెక్కించిన టిఎన్ సంతోష్ తెలుగులోనూ దర్శకుడు.
ఈ చిత్రంలోని పూర్తి కథను కాకుండా.. కేవలం లైన్ మాత్రమే తీసుకుని ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కథను మార్చామని చెబుతున్నాడు నిఖిల్. ఇది ఫేక్ సర్టిఫికేట్ల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. అథర్వ నటించిన ఈ చిత్రం తమిళనాట మంచి విజయం సాధించింది.
ముందు ఈ చిత్రాన్ని రవితేజతో రీమేక్ చేయాలని భావించాడు దర్శకుడు సంతోష్. రవితేజ ఫైనల్ అయిన తర్వాత ఎందుకో ఆగిపోయింది ఈ చిత్రం. ఇప్పుడు నిఖిల్ వచ్చాడు ఈ ప్రాజెక్ట్ లోకి. షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
దీనికి ముద్ర అనే టైటిల్ ఖరారు చేసారు. ఫేక్ సర్టిఫికేట్ ల నేపథ్యం కాబట్టి ముద్ర అనేది పర్ ఫెక్ట్ టైటిల్. తాజాగా విడుదలైన లుక్ కూడా సినిమాపై ఆసక్తి పెంచేస్తుంది. లావణ్య త్రిపాఠి ఇందులో హీరోయిన్. షూటింగ్ స్టేజ్ లో ఉన్నపుడే ఈ ముద్ర శాటిలైట్ రైట్స్ ను ఓ లీడింగ్ ఛానెల్ 5.50 కోట్లకు దక్కించుకుంది. బడ్జెట్ కూడా 10 కోట్లలోపే ఉంది. అందులో సగం ఇప్పుడే వచ్చేసింది. మొత్తానికి ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు నిఖిల్.