ఇప్పుడు ఇలాంటి ఛాలెంజ్ లే చేస్తున్నారు రాజస్థాన్ దర్శక నిర్మాత కిషోర్ శేఖర్. ఈయన త్వరలోనే పద్మావతి జీవితంపై సినిమా చేయనున్నాడు. ఇప్పటికే పద్మావతి జీవితం ఆధారంగా భన్సాలీ 150 కోట్లతో ఓ సినిమా చేస్తే.. అది చరిత్రను వక్రీకరించారంటూ దాన్ని ఆపేసారు. ఇక ఇప్పుడు అసలు చరిత్ర ఏంటో.. రాణి పద్మిని అంటే ఎవరో మేం చూపిస్తాం అంటున్నారు కిషోర్ శేఖర్. పద్మిణి జీవితం ఎలా ఉంటుందో రాజస్థాన్ తో పాటు ఇండియన్ సినిమా కూడా చూస్తుందని.. త్వరలోనే తమ సినిమా మొదలుపెడతామని అనౌన్స్ చేసాడు ఈ దర్శకుడు. ఈ చిత్రానికి మై హూ పద్మావతి అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ విషయంపై భన్సాలీ అండ్ టీం కూడా చాలా స్పోర్టివ్ గా ఉన్నారు. తీయమనండి.. మేం చూపించని చరిత్రను వాళ్లేం చూపిస్తారో అంటున్నాడు ఆయన కూడా. తమ సినిమా విడుదల మాత్రం ఎప్పుడు ఉంటుందో చెప్తే బాగుంటుందంటున్నాడు ఈయన. డిసెంబర్ 1న పద్మావతి విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే అన్నీ సిద్ధం చేసుకున్నాడు భాన్సాలీ. కానీ చివరి నిమిషంలో అన్నీ చెదిరిపోయాయి.
ఈ చిత్రానికి ఇప్పటి వరకు సెన్సార్ కూడా పూర్తి కాలేదు. ఇన్నాళ్లూ డిసెంబర్ లోనే వస్తుందనే నమ్మకం ఉండేది.. ఇప్పుడు అది కూడా పోయింది. ఈ చిత్రం 2018కి పోస్ట్ పోన్ అయింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరిలో సినిమాను సెన్సార్ చేయించి.. ఫిబ్రవరి 9న విడుదల చేయాలని చూస్తున్నాడు భన్సాలీ. ఎందుకంటే అప్పటి వరకు మంచి రిలీజ్ డేట్ కూడా లేదు కదా మరి. అన్ని భాషల్లోనూ కలెక్షన్లు ముఖ్యమే కాబట్టి అన్ని చోట్లా ఒకేలా విడుదలయ్యేలా చూసుకుంటున్నాడు ఈ దర్శకుడు. అందుకే కాస్త ఆలస్యమైనా పర్లేదు కానీ మంచి విడుదల తేదీతోనే రావాలని కోరుకుంటున్నాడు భన్సాలీ. కానీ ఎవరేం అన్నా ఇప్పటికే పద్మావతికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎంత ఇన్స్యూరెన్స్ చేయించినా కూడా ఈ చిత్రం విషయంలో నష్టం అయితే తప్పనిసరి అని తేలిపోయింది. మరి అది ఏ స్థాయిలో ఉంటుందనేది త్వరలోనే తేలనుంది. మొత్తానికి చూడాలిక.. పద్మావతి ఈ ప్రపంచాన్ని ఎప్పటికి చూస్తుందో..?