ముఖ్యమంత్రి అంటే అంత చిన్న విషయం కాదు. ఓ రాష్ట్రాన్ని మోయాల్సిన బాధ్యత అతడిపై ఉంటుంది. అలాంటి బరువైన పాత్రలు చేయాలంటే ఆ నటుడికి ఎంతో అనుభవం కూడా ఉండాలి. తెలుగులోనూ కొందరు హీరోలు ముఖ్యమంత్రులుగా రప్ఫాడించారు. స్క్రీన్ ను షేక్ చేసారు.
సీనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లు నిజజీవితంలోనే ముఖ్యమంత్రులు అయ్యారు కానీ నాటి కృష్ణ నుంచి నేటి మహేశ్ వరకు సిల్వర్ స్క్రీన్ పై ముఖ్యమంత్రులుగా రాణిస్తున్నారు. ఇప్పుడు విడుదలకు సిద్ధమైన భరత్ అనే నేనులో మహేశ్ ముఖ్యమంత్రిగా నటించారు. కానీ మహేశ్ కంటే ముందే ఆయన తండ్రి..
సూపర్ స్టార్ కృష్ణ 35 ఏళ్ల కింద ముఖ్యమంత్రి సినిమాలో నటించారు. దానికి ఆయన సతీమణి విజయనిర్మలే దర్శకురాలు. అప్పట్లో ఆ సినిమా సంచలన విజయం సాధించింది.
ఇక ఇప్పుడు ఆయన తనయుడు భరత్ అనే నేనులో సిఎంగా కనిపిస్తున్నాడు. కొరటాల శివ దీనికి దర్శకుడు. గత కొన్ని దశాబ్ధాల్లో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే సిఎం పాత్రల్లో నటించారు. ఎందుకంటే రాజకీయ నేపథ్యంలో సినిమా అంటే అంత ఈజీ కాదు. కృష్ణ తర్వాత నాగేశ్వరరావ్ కూడా ముఖ్యమంత్రిగా నటించారు.
నిజ జీవితంలో రాజకీయాలంటే చాలా దూరం ఉండే ఏఎన్నార్.. రాజకీయ చదరంగం సినిమాలో ముఖ్యమంత్రిగా నటించారు. ఇక శంకర్ ఒకే ఒక్కడులో అర్జున్ వేసిన ఒక్కరోజు ముఖ్యమంత్రి పాత్ర మరిచిపోవడం అంత ఈజీ కాదు. ఆ పాత్రను శంకర్ మలిచిన తీరు అలా ఉంటుంది మరి.
ఇక పదేళ్ల కింద లీడర్ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రతోనే ఇండస్ట్రీకి వచ్చాడు రానా. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం కూడా పర్లేదనిపించింది. మొన్నటికి మొన్న నేనేరాజు నేనేమంత్రిలో కూడా సిఎం పీఠం అధిష్టించడానికి సిద్ధమయ్యాడు రానా. ఇప్పుడు మహేశ్ వస్తున్నాడు.
మరి ఈయన ముఖ్యమంత్రిగా చేసే పనులు ఎలా ఉండబోతున్నాయో..? ఏదేమైనా మన హీరోలకు ముఖ్యమంత్రి పీఠం బాగానే కలిసొచ్చింది. చాలా మంది హీరోలకు ఆ సినిమాలు కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయాయి. ఇప్పుడు భరత్ తో మహేశ్ ఏం చేస్తాడో చూడాలిక..!