నిజమే.. అదృష్టం అంటే ఇప్పుడు ఇలాగే ఉండాలి మరి. లేకపోతే మరేంటి..? ఈ రోజుల్లో ఓ చిన్న సినిమా మూడు రోజులు థియేటర్స్ లో కనబడటం కాదు.. కనీసం థియేటర్స్ దొరకడం కూడా కష్టమే. అలాంటిది మూడు వారాలు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ హౌజ్ ఫుల్స్ తో సినిమా ఆడుతుంది అంటే అంతకంటే అదృష్టం ఇంకేం కావాలి..?
ఇప్పుడు మహానటి విషయంలో ఇదే జరుగుతుంది. పైగా ఈ సినిమా విడుదలైన ముహూర్తం ఏంటో కానీ ఆ తర్వాత దీనికి పోటీగా వచ్చిన ప్రతీ సినిమా కూడా చేతులెత్తేస్తుంది. మూడు వారాలుగా బాక్సాఫీస్ దగ్గర దీని జోరు తట్టుకునే సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. వచ్చిన సినిమాలన్నీ అలా వెళ్లిపోతున్నాయంతే. నా పేరు సూర్య.. మెహబూబా.. నేలటికెట్.. అమ్మమ్మగారిల్లు.. ఇలా అన్నీ మహానటి ముందు తోకముడిచాయి.
ఇక ఇప్పుడు విడుదలైన మూడు సినిమాలు కూడా ఇలాగే ఉన్నాయి. నాగార్జున ఆఫీసర్ డిజాస్టర్.. ఇక రాజ్ తరుణ్ రాజుగాడు కూడా అలాంటి సినిమానే. ఇక అభిమన్యుడు మాత్రమే మంచి సినిమా అయినా ఇది డబ్బింగ్ సినిమా. దీనికి ప్రమోషన్ చేసుకుంటే తప్ప నిలబడే అవకాశాలు లేవు. అయితే నిలబడినా మహానటిని అడ్డుకునేంత అయితే కాదు. ఒక మంచి సినిమా చేసినపుడు అన్నీ దానికి అలా కలిసొస్తాయని ముందు నుంచి మహానటి టీం నమ్ముతుంది. అదే రేంజ్ లో ప్రమోషన్ కూడా చేసుకుంటున్నారు వాళ్లు.
దాంతో సినిమా థియేటర్స్ లో రోజురోజుకీ ఇంకా దున్నేస్తూనే ఉంది. ఇప్పటికే 38 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. సావిత్రి బతికి ఉన్నపుడు చివరి రోజుల్లో తన దగ్గర ఏమీ లేనపుడు కూడా సాయం చేసింది. ఇప్పుడు ఆమె చనిపోయిన 37 ఏళ్ల తర్వాత కూడా తన జీవితంతో ఏడేళ్లుగా కష్టాల్లో ఉన్న అశ్వినీదత్ ను నష్టాల్లోంచి.. కష్టాల్లోంచి బయట పడేసింది. మొత్తానికి అప్పుడు ఇప్పుడూ సావిత్రి అంటే దానానికి మారుపేరే.