చనిపోయిన తర్వాత సావిత్రిని ఎవరూ పట్టించుకోలేదు.. బతికున్నపుడు చివరి రోజుల్లో కూడా వదిలేసారు. కానీ ఇప్పుడు ఆమె చనిపోయిన 37 ఏళ్ళ తర్వాత మళ్లీ ఆ మహానటి గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఆమె బయోపిక్ మహానటి.
ఇదంతా నాగ్ అశ్విన్ ప్రతిభే. 30 ఏళ్ల వయసులోనే ఆ మహానటిపై సినిమా చేసి అందరికీ ఆమె ఏంటో మరోసారి పరిచయం చేసాడు అశ్విన్. కలెక్షన్ల విషయంలోనూ మహానటి తన సత్తా చూపించింది. ఒకటి రెండు కాదు.. 43 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి నిర్మాతల పంట పండించింది. ఏడేళ్లుగా ఒక్క హిట్ కూడా లేని వై జయంతి బ్యానర్ కు పునర్వైభవం తీసుకొచ్చింది మహానటి.
50 రోజుల వరకు కూడా వసూళ్లు కురిపిస్తూనే ఉంది ఈ చిత్రం. ఇక ఇప్పుడు మహానటికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ కు ఇండియా నుంచి మహానటి ఎంపికైంది. అది కూడా ఉత్తమ చిత్రం.. నటి.. సహాయనటి కేటగిరీల్లో. ఎక్కడో ఆస్ట్రేలియాలో జరిగే ఈ వేడుకకు ఇక్కడి నుంచి మన సినిమా ఎంపిక కావడం నిజంగా గర్వ కారణమే. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ తెలియచేసాడు. దాంతో మహానటి సాధించిన ఘనతల్లో ఇది కూడా చేరిపోయింది.