ఇప్పుడు ఇండస్ట్రీలో వాయిదాల పర్వం నడుస్తుంది. ఓ సినిమా విడుదల తేదీ అనౌన్స్ చేయడం.. దాన్ని మార్చడం ఇప్పుడు ఫ్యాషన్ అయింది. ఇప్పటికే చాలా సినిమాల విడుదల తేదీలు మారిపోయాయి. ఇప్పుడు ఇదే లిస్ట్ లో మహానటి కూడా చేరిపోయింది. చేతిలో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది కాబట్టి మార్చ్ 29న రంగస్థలానికి పోటీగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ కాలం కలిసి రావడం లేదు. ఈ చిత్ర సిజి వర్క్ ఇంకా పూర్తి కాలేదు. కచ్చితంగా ఇది పూర్తయ్యే సరికి ఇంకా టైమ్ పట్టేలా ఉంది. దాంతో అనుకున్నట్లుగా 29న ఈ సినిమా రాకపోవచ్చు. దాంతో ఆ తేదీని కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే తీసుకుంటున్నాడు.
సావిత్రి జీవితం ఆధారంగా మహా నటి తెరకెక్కుతోంది. సావిత్రి జీవితం అంటే కొందరి సొత్తు కాదు.. అది అందరు తెలుగు వాళ్ల హక్కు. ఈమె జీవితం తెరిచిన పుస్తకం. ఆ పుస్తకంలో ఉన్న విషయంలో తెలుసుకోడానికి ప్రతీ తెలుగువాడు ఆసక్తి చూపిస్తూనే ఉంటాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. మాయాబజార్ సెట్ లోకి సావిత్రి పాత్రధారి అయిన కీర్తిసురేష్ వచ్చి.. బాక్సు తెరవగానే అందులోంచి సావిత్రి స్వరంతో కూడిన కొన్ని డైలాగులు.. పాటలు వస్తాయి. తర్వాత కొన్ని కథలు చరిత్రే.. వాటికి అంతం ఉండదంటూ రాసుంటుంది. వెంటనే మహానటి అంటూ టైటిల్ వస్తుంది. ఇదంతా చూస్తుంటే సినిమా ఎంత విజువల్ వండర్ గా ఉండబోతుందో అర్థమైపోతుంది. ఆలస్యం అయినా పర్లేదు కానీ ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు దర్శక నిర్మాతలు. మొత్తానికి సమ్మర్ బరి నుంచి మరో సినిమా కూడా తప్పుకుందన్నమాట.