కొందరు దర్శకులపై తెలియకుండానే హాలీవుడ్ సినిమాల ప్రభావం భారీగా ఉంటుంది. వాళ్లే సినిమా చేసినా ఎక్కడో ఓ చోట దానికి ఒరిజినల్ ఉంటుంది. అయితే పూర్తిగా కాపీ కొట్టడం కాదు కానీ స్పూర్థి పొంది రాసుకోవడం మాత్రం తప్పు కాదు. ఎక్కడ ఏ మంచి కథ దొరికినా దాన్ని మనకు అనుకూలంగా రాసుకోవడం అస్సలు తప్పు కాదు. వంశీ పైడిపల్లి కూడా ఇదే చేస్తుంటాడు. ఎవడు సినిమాను ఫేస్ ఆఫ్ కు స్పూర్తిగా తీసుకుని రాసుకున్నాడు. ఆ తర్వాత ఊపిరి సినిమాను ఫ్రెంచ్ సినిమా ఇన్ టచబుల్స్ ఆధారంగా మనకు తగ్గట్లు అద్భుతంగా తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నాడు.
ఈ చిత్రానికి మూలం ఆస్ట్రేలియన్ సిరీస్ అని తెలుస్తుంది. ది మాటర్ సైకిల్ రైడర్ అనే ఆస్ట్రేలియన్ సిరీస్ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో హీరో కారెక్టరైజేషన్ ను మహేశ్ కోసం తీసుకుంటున్నాడనే ప్రచారం జరుగుతుంది. కేవలం కారెక్టరైజేషన్ మాత్రమే తీసుకుని.. కథను పూర్తిగా సొంతంగా రాసుకుంటున్నాడు వంశీ పైడిపల్లి. కథ కూడా పూర్తిగా అమెరికా నేపథ్యంలోనే సాగనుంది. జూన్ 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ మధ్యే టూర్ పూర్తి చేసుకుని హైద్రాబాద్ కు వచ్చాడు మహేశ్.
వంశీ సినిమా తొలి షెడ్యూల్ డెహ్రాడూన్ లో జరగనుంది. అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. మహేశ్ పాత్ర మిలినియర్ అయితే.. నరేష్ పాత్ర పేద అని.. ఈ ఇద్దరి మధ్య స్నేహమే సినిమా కథ అని తెలుస్తుంది. అన్నట్లు ఇది మహేశ్ బాబుకు 25వ సినిమా కావడం విశేషం. దిల్ రాజు, అశ్వినీదత్ నిర్మాతలు. డిసెంబర్ లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. చూడాలిక.. ఏం జరుగుతుందో..?