అవును.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే జరుగుతుంది. మహేశ్ కు తెలిసి జరుగుతుందో.. లేదంటే వాళ్ల డాబు కోసం ఆయన్ని వాడుకుంటున్నారో తెలియదు కానీ నిర్మాతలు చూపిస్తున్న అత్యుత్సాహానికి ఇప్పుడు మహేశ్ ఇమేజ్ బలైపోయింది మధ్యలో. ఫేక్ రికార్డుల కోసం వాళ్లు పెడుతున్న గోలతో మహేశ్ అభిమానులు ఫీల్ అవుతున్నారు..
బయట ప్రేక్షకులు తిట్టుకుంటున్నారు. నిజంగా హిట్ అవుతున్న సినిమాలకు కూడా నిర్మాతల ఓవర్ యాక్షన్ తో చెడ్డపేరు తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు భరత్ అనే నేనునే తీసుకోండి. ఈ చిత్రం బాగానే ఆడుతుంది. కానీ తొలిరోజు నుంచే రికార్డుల వేటలో భరత్ ను ముందుంచాలనే నిర్మాతల ఆశ ప్రేక్షకుల్లో సినిమా విజయంపై లేనిపోని అనుమానాలను పెంచేస్తుంది. రెండు రోజుల్లోనే 100 కోట్లు వచ్చాయంటూ పోస్టర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.
కానీ నాలుగు రోజుల్లో ఈ మార్క్ అందుకుంది చిత్రం. ఎలాగూ 100 కోట్లు వస్తాయి కదా.. రెండు రోజులు ఆగితే అయిపోతుంది కానీ నిర్మాతలు ఆగలేపోతున్నారు.
ఫేక్ రికార్డులను ప్రేక్షకుల్లోకి పంపిస్తున్నారు. ఫస్ట్ వీక్ అలా అయిపోయిందో లేదో మళ్లీ నిర్మాతల అత్యుత్సాహం మొదలైంది. ఈ సారి ఏకంగా పోస్టర్ పై తొలివారంలోనే 161 కోట్ల గ్రాస్ వసూలు చేసింది అంటూ వేసారు. ఇది ఇప్పుడు నిజంగానే సినిమాపై పక్కా నెగిటివ్ ఇంప్రెషన్ తీసుకొస్తుంది. లేకపోతే మరేంటి..? 161 కోట్ల గ్రాస్ అంటే 100 కోట్ల షేర్ రావాలి. మరి తొలివారంలో అంత షేర్ వచ్చిందా అంటే రాలేదు.
ఇప్పటి వరకు 75 కోట్ల షేర్ వచ్చింది ఈ చిత్రానికి. అంటే వచ్చినదానికంటే 30 కోట్లు ఎక్కువగా చెప్పుకున్నారు దర్శక నిర్మాతలు. ఇది ఎవరికి నష్టం. అప్పట్లో దూకుడు.. బిజినెస్ మ్యాన్ కు కూడా ఇదే చేసారు నిర్మాతలు. అంతెందుకు డిజాస్టర్ అయిన స్పైడర్ కు కూడా 150 కోట్ల పోస్టర్ విడుదల చేసి విమర్శల పాలయ్యారు. మరి ఇప్పటికైనా మహేశ్ ఇమేజ్ తో ఆడుకోవడం మానేస్తారో.. లేదంటే ఆయన్ని ఇలాగే ఫేక్ రికార్డుల స్టార్ గా నిలబెడతారో చూడాలిక..!