మహేశ్ బాబు ఏ ఆడియో వేడుకలో చూసినా కాస్త కామ్ గా.. సైలెంట్ గా ఉంటాడు. పెద్దగా మాట్లాడడు కూడా. కానీ ఎందుకో తెలియదు కానీ భరత్ అనే నేను బహిరంగ సభలో మాత్రం చాలా ఓపెన్ అయ్యాడు మహేశ్ బాబు. అభిమానులపై కూడా సెటైర్లు వేసాడు. ఇండస్ట్రీలో హీరోలంతా ఎలా ఉంటామో అందరికీ తెలిసేలా చెప్పాడు. తన వేడుకకు తమ్ముడు ఎన్టీఆర్ రావడం మీకు ఆశ్చర్యంగా ఉందేమో కానీ నాకు కాదని చెప్పాడు మహేశ్. ఎప్పుడో ఆది నుంచే తమ మధ్య ఇలాంటి బంధం ఉందని గుర్తు చేసుకున్నాడు సూపర్ స్టార్. ఇక హీరోలంతా మేం బాగానే ఉంటాం కానీ మీరే సరిగ్గా లేరు.. ఇంకా బాగుండాలంటూ సెటైర్లు కూడా వేసాడు. ఇకపై ఇండస్ట్రీలో రూల్స్ కూడా మారతాయని.. బారికేడ్స్ ఉండవని.. ప్రతీ హీరో వేడుకకు మరో హీరో వస్తాడని చెప్పాడు మహేశ్. అంతా కలిసే ఉంటామని.. మల్టీస్టారర్స్ కూడా వస్తాయని.. ఇండస్ట్రీ బాగుండటమే అందరికీ కావాలని చెప్పాడు మహేశ్ బాబు. తనకు కూడా అవార్డులు.. రికార్డులతో పనిలేదని.. తనను నమ్మి సినిమా తీసిన నిర్మాతకు నాలుగు డబ్బులొస్తే అదే చాలు అంటున్నాడు సూపర్ స్టార్. మొత్తానికి ఈయన మాటలు చాలా కొత్తగా అనిపించాయి కూడా. ఎప్పుడూ ముభావంగా కనిపించే మహేశ్ లో ఈ రేంజ్ చమత్కారం ఉందా అని ఆశ్చర్యపోయారు ఆడియన్స్. దాంతో పాటు తన కెరీర్ లోనే భరత్ అనే నేను పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని ధీమాగా చెప్పాడు మహేశ్. మరి ఈయన నమ్మకాన్ని కొరటాల ఎంత వరకు నిలబెడతాడో చూడాలిక..!