కోట్లు అంటే మన నిర్మాతలకు కనీసం వేసుకునే కోట్ల కంటే చీప్ అయిపోయాయి. లేకపోతే మరేంటి.. ఒకప్పుడు 100 కోట్ల సినిమా వస్తే బాగుండు అని ఆశగా ఎదురు చూసేవాళ్లు నిర్మాతలు. 100 కోట్లు వస్తే రికార్డుగా చెప్పుకునే వాళ్లు. కానీ ఇప్పుడు రికార్డుల కోసమే 100.. 200 కోట్లంటూ పోస్టర్స్ రిలీజ్ చేసి నవ్వుల పాలవుతున్నారు. నిజంగా వచ్చిన సినిమాకు పోస్టర్లు విడుదల చేస్తే తప్పులేదు. కానీ ఇష్టమొచ్చినట్లుగా ఫ్లాప్ సినిమాలకు కూడా 100 కోట్ల పోస్టర్ విడుదల చేస్తుంటేనే ఇప్పుడు నవ్వొస్తుంది ప్రేక్షకులకు. తాజాగా అల్లుఅర్జున్ నా పేరు సూర్య ఒక్క వారాలకు 101 కోట్ల గ్రాస్ వసూలు చేసిందంటూ పోస్టర్ విడుదల చేసాడు నిర్మాత లగడపాటి శ్రీధర్. మరోవైపు ఈ చిత్రం కొన్న బయ్యర్లు డబ్బులు వెనక్కి రాక.. దిక్కులు చూస్తున్నారు. ఈ సమయంలో 100 కోట్ల పోస్టర్ విడుదల చేయడంతో ఎక్కడ లేని కోపాలు వచ్చేస్తున్నాయి వాళ్లకు. కానీ ఏం చేస్తారు.. అత్తారింటికి దారేదిలో పవన్ మాదిరే కంటికి కనిపించని శక్తులతో బయటికి కనిపించని యుద్ధం చేస్తున్నారు. బన్నీ మాత్రమే కాదు.. మహేశ్ కూడా ఇంతే. ఈయన భరత్ అనే నేను 200 కోట్ల గ్రాస్ వచ్చిందంటూ పోస్టర్ విడుదల చేసాడు నిర్మాత. దీనిపై కూడా ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. మొత్తానికి మన హీరోలకు ఇప్పుడు వందల కోట్ల పిచ్చి పట్టేసింది. విడుదలైన తర్వాత కచ్చితంగా ఆ పోస్టర్ చూడకపోతే నిద్ర కూడా పట్టేలా లేదు.