అదేంటి.. రంగస్థలానికి ఉయ్యాలా జంపాలాకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి చూస్తుంటే ఇదే గుర్తొస్తుంది మరి. ఉయ్యాలా జంపాలా అంటే ముందుకు వెనక్కి ఊగుతుంది కదా. ఇప్పుడు రంగస్థలం రిలీజ్ డేట్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ మధ్య కాలంలో విడుదల తేదీ కోసం రంగస్థలం కంటే కష్టపడిన సినిమా మరోటి లేదు. అన్ని సినిమాల విడుదల తేదీపై క్లారిటీ వస్తుంది కానీ రంగస్థలం 1985పై మాత్రం రావడం లేదు. ఈ చిత్ర షూటింగ్ అనుకున్నట్లుగానే డిసెంబర్ లోనే పూర్తి కానుంది. ఇప్పటికే టాకీ పూర్తయింది.. రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్. షూటింగ్ కు అనుకున్న టైమ్ కే గుమ్మడికాయ్ కొట్టినా సినిమా సంక్రాంతికి రావట్లేదు. దానికి కారణం పవన్ కళ్యాణ్ కూడా సంక్రాంతికి వస్తుండటమే.
గత కొన్నేళ్లుగా సంక్రాంతికి ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా కూడా.. అన్నీ విజయం సాధిస్తున్నాయి. ఇక్కడ మరో ఆప్షన్ ఉంది. మహేశ్ భరత్ అనే నేను సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది. ఇవన్నీ పక్కనబెడితే జనవరి 25న వస్తుందనుకున్న రజినీకాంత్ 2.0 కూడా ఎప్రిల్ కి వాయిదా పడింది. అంటే సంక్రాంతి సినిమాలకు ఫిబ్రవరి వరకు పోటీ ఉండదు. ఇలాంటి టైమ్ లో పవన్, బాలయ్య మాత్రమే పండక్కి వస్తున్నారు. మరో సినిమాకు కూడా ఇక్కడ స్కోప్ ఉంది. అందుకే రంగస్థలం సినిమాను మార్చ్ 29 వరకు వేచి చూడటం ఎందుకు.. ఫిబ్రవరిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. పైగా మార్చ్ 29న మహానటి కూడా విడుదల కానుంది. ఆ సినిమా రంగస్థలంకు పోటీ కాకపోవచ్చు కానీ ఎందుకు మరో సినిమాతో పోటీ పడటం అంటున్నాడు చరణ్.
ఇదే విషయమై చరణ్ తో కూడా మాట్లాడుతున్నారు. సంక్రాంతికి బాబాయ్ తో పోటీ పడటం తనకు ఇష్టం లేదు కానీ మిగిలిన టైమ్ లో ఎప్పుడైనా ఓకే అన్నట్లుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే ఫిబ్రవరీలో మంచి తేదీ చూసుకుని రంగస్థలంను విడుదల చేయాలని చూస్తున్నారు. గత కొన్నేళ్లలో టెంపర్, మిర్చి లాంటి సినిమాలు ఫిబ్రవరీలోనే వచ్చాయి. ఇప్పుడు రంగస్థలంను ఇలాగే తీసుకురావాని చూస్తున్నారు. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ ను ఏకంగా 18 కోట్లకు కొనేసింది ఆ ప్రముఖ ఛానెల్. మరి చూడాలిక.. చివరి వరకు ఏం జరుగుతుందో.. రంగస్థలం ఎప్పుడొస్తుందో..?