మెగా అభిమానులకు ఈ సంక్రాంతి పెద్దగా కిక్ ఇవ్వలేదు. రికార్డులు తిరగరాస్తాడనుకున్న పవన్ కాస్తా వెనక్కి మళ్లాడు. ఈయన అజ్ఞాతవాసి అడ్రస్ గల్లంతైపోయింది. దాంతో ఇప్పుడు అందరి చూపు రంగస్థలం సినిమాపై పడింది. దానికి తగ్గట్లే సంక్రాంతికి తీపికబురు చెప్పాడు రామ్ చరణ్. ఈ చిత్ర టీజర్ జనవరి 24న విడుదల కానున్నట్లు పోస్టర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. రంగస్థలం గురించి ఇండస్ట్రీలో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. దానికి కారణం పోస్టర్స్.. అందులో ఉన్న ఫీల్.. మనసును కదిలిస్తుందేమో అనేంతగా పోస్టర్స్ లోనే కావాల్సినంత లైవ్లీనెస్ ఇచ్చాడు దర్శకుడు సుకుమార్. అదే రంగస్థలం. ఆ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ చూసిన తర్వాత రంగస్థలంలో ఎంత విషయం ఉందో అర్థమైపోతుంది. ఆ ఫస్ట్ లుక్ లోనే కావాల్సినంత కథ చెప్పేసాడు ఈ దర్శకుడు.
అందులో చరణ్ ఎర్ర బనియన్ వేసుకుంటాడు.. అంటే అతడు డైలీ లేబర్.. పైగా అతడికి చెవులు వినబడవు.. తలపై మొక్కజొన్న మోస్తూ కాస్త వింతగా చూస్తుంటాడు. ఆ పోస్టర్ లోనే కావాల్సినంత అమాయకత్వం కనిపిస్తుంది. ఇలా రంగస్థలం చాలా వెరైటీగా ఉండబోతుంది. ఈ చిత్రం కచ్చితంగా చరణ్ కెరీర్ లోనే మైలురాయిగా మిగిలిపోతుందంటున్నారు దర్శక నిర్మాతలు. మనమంతా మెకానికల్ లైఫ్ లో పడిపోయాం.. బంధాలు అనుబంధాలు ఇప్పటికీ ఉన్నాయి.. కానీ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు అలా లేవు. ఇది మన మనసు కూడా ఒప్పుకోవాల్సిన నిజం. కాస్త వెనక్కి వెళ్లి చూసుకుంటే ఆ రోజుల్లో అన్నీ ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎలా మారాయి అనేది మనకే అర్థమైపోతుంది. ఇప్పుడు రంగస్థలం సినిమా కూడా సరిగ్గా ఇదే నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇందులో రామ్ చరణ్ పాత్ర గురించి ఇప్పటికే సుక్కు చాలా చెప్పాడు.
80వ దశకంలో ఫేమస్ అయిన పీచు మిఠాయి.. గోలీసోడా.. గోల్డ్ స్పాట్ కూల్ డ్రింక్.. అప్పట్లో ఉండే షాపులు.. జాతర.. అక్కడ రంగులరాట్నం.. ఇవన్నీ ఫోటోలో దర్శనమిస్తున్నాయి. పైగా ఈ సెట్ లో ఉన్న చాలా వస్తువులను పోలవరం ముంపు ప్రాంతాల్లో పోయిన గ్రామాల్లోంచి కొనుక్కుని తీసుకొచ్చారు. అందుకే చాలా న్యాచురల్ గా రంగస్థలం సిద్ధమవుతుంది. ఈ చిత్ర ఫలితంపై కావాల్సినంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు మెగా వారసుడు కచ్చితంగా రంగస్థలంతో తాను బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమంటున్నాడు. మార్చ్ 30, 2018లో సినిమా విడుదల కానుంది ఈ చిత్రం. మొత్తానికి తన సినిమాతో ప్రేక్షకులను మాయ చేయాలని ఫిక్సైపోయాడు సుకుమార్.