రంగస్థలం గురించి ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు బయట కూడా భారీగానే చర్చ నడుస్తుంది. ఈ ఏడాది అజ్ఞాతవాసి తర్వాత వస్తోన్న అంత పెద్ద సినిమా ఇదే. మధ్యలో వచ్చిన సినిమాలన్నీ చిన్నా చితకా సినిమాలే. బాలయ్య జై సింహాతో సహా. దాంతో ఇప్పుడు రంగస్థలంపై ఎక్కడ లేని అంచనాలున్నాయి. అప్పుడు అజ్ఞాతవాసి ఊరించి ఉసూరుమనిపించింది. దాంతో ఇప్పుడు అబ్బాయిపైనే ఆశలున్నాయి మెగా అభిమానులకు. సుకుమార్ పై కాస్త అపనమ్మకం ఉన్నా.. ట్రైలర్ లు, పాటలు ఇప్పటికే హిట్ కావడంతో సినిమా కూడా అదిరిపోతుందని నమ్ముతున్నారు వాళ్లు. అయితే మూడు గంటల సినిమా అనేది కూడా ఫ్యాన్స్ కు కంగారు పుట్టిస్తుంది. ఇన్ని అనుమానాలు.. మరిన్ని అంచనాల మధ్య మార్చ్ 30న విడుదలకు సిద్ధమైంది రంగస్థలం. ఈ చిత్ర తొలి రోజు కలెక్షన్లపై ఇప్పుడు చర్చ నడుస్తుంది. అంతా ఊహించినట్లుగా ఈ చిత్రాన్ని ఏ 2000 స్క్రీన్స్ లో విడుదల చేయడం లేదు.
చాలా తక్కువ స్క్రీన్స్ లో.. ఈ మధ్య కాలంలో ఏ భారీ సినిమా కూడా రానన్ని తక్కువ థియేటర్స్ లో రంగస్థలాన్ని విడుదల చేస్తున్నారు. కేవలం 1300 స్క్రీన్స్ లో మాత్రమే ఈ చిత్రం వస్తుంది. అదేంటి అని అడిగితే.. ఇదోరకం స్ట్రాటజీ అంటున్నారు. ఓవర్సీస్ లో 400 స్క్రీన్స్ లో రానుంది ఈ చిత్రం. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన చోట్ల కలిపి మరో 800 థియేటర్స్ యాడ్ కానున్నాయి. తొలిరోజు రంగస్థలం రేంజ్ కచ్చితంగా 20 కోట్ల షేర్ వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం ఈజీగా 18 కోట్ల వరకు కలెక్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఓవర్సీస్ లో 3 కోట్లపైనే ఊహిస్తున్నారు. ఓవరాల్ గా 20-22 కోట్ల షేర్ తీసుకొచ్చేలా కనిపిస్తుంది రంగస్థలం. ఇప్పట్లో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఓపెనింగ్స్ వరకు ఢోకా లేదు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే పండగే ఇక. మరి చూడాలిక.. చరణ్ ఏం చేస్తాడో..?