ఈ రోజుల్లో పెద్ద సినిమాలకు పెట్టిన పెట్టుబడి వస్తే చాలనుకుంటున్నారు బయ్యర్లు. ఎలాగూ హై రేట్లు పెట్టి కొంటున్నారు కదా.. పెట్టిన దానికి ఓ కోటి వచ్చినా పండగ చేసుకుంటున్నారు. పెద్ద సినిమాలను నమ్ముకుని అది కూడా సంపాదించుకోవడం కష్టమైపోయింది ఈ రోజుల్లో. ఎన్ని కోట్లొచ్చినా లాభాలు మాత్రం రావట్లేదు.
ఇలాంటి టైమ్ లో పెద్ద సినిమాలపై నమ్మకం మళ్లీ పెంచేసింది రంగస్థలం. ఈ చిత్రాన్ని 80 కోట్లకు అమ్ముతున్నపుడు అంతా షాక్ అయ్యారు. అసలు రామ్ చరణ్ మార్కెట్ 60 కోట్లల్లో ఉంది ఎలా కొంటారు 80 కోట్లకు.. పిచ్చేమైనా పట్టిందా అనుకున్నారంతా. కానీ ఈ సినిమా ఇప్పుడు నాన్ బాహుబలిలో నెం.1 హిట్. ఒకటి రెండు కాదు.. ఏకంగా 120 కోట్ల షేర్ సాధించింది.. 200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఒక్క బాహుబలికి మాత్రమే ఇప్పటి వరకు ఈ రికార్డులు సాధ్యమయ్యాయి.
రంగస్థలం బయ్యర్లకు ఏకంగా 42 కోట్ల లాభాలు తీసుకొచ్చింది. నిర్మాతలకు అయితే చెప్పాల్సిన పనిలేదు. ఓవర్సీస్ లో 9 కోట్లకు సినిమాను అమ్మి.. 18 కోట్లు వచ్చింది. అక్కడే రెండితలు లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. ఇక నైజాంలో 18 కోట్లకు అమ్మితే.. 26 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా వస్తూనే ఉంది కూడా. సీడెడ్.. కర్ణాటక.. తమిళనాడు.. నెల్లూర్.. కృష్ణా.. గుంటూర్ ఇలా ఎక్కడ తీసుకున్నా లాభాల పంట పండించాడు సిట్టిబాబు.
ఈ మధ్య కాలంలో ఓ పెద్ద సినిమా ఇంతగా వసూళ్లు రాబట్టడం మాత్రం ఇదే తొలి సారి. బాహుబలి తర్వాత ఓ స్టార్ హీరో సినిమా ఇంత లాభాలు తీసుకురావడం ఇదే తొలిసారి. ఇప్పుడు భరత్ అనే నేను కూడా భారీ వసూళ్లనే సాధిస్తున్నా కూడా రంగస్థలం రేంజ్ లో మాత్రం హిట్ కాదు. అది సేఫ్ అవ్వడానికే 100 కోట్లు రావాలి. దాన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు భరత్ టార్గెట్ ఎంత పెద్దదో..?