ఒకడు ఒకసారి మోసం చేస్తే అది వాడి తప్పు.. రెండోసారి కూడా మోసపోతే అది నీ తప్పు అంటారు. కానీ అదే వ్యక్తి మూడో సారి కూడా మోసం చేస్తాడేమో అని తెలిసినా నమ్మడం ఎవరి తప్పు అనాలి..? ఇప్పుడు రజినీకాంత్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇంతకీ రజినీకాంత్ ఎవర్ని నమ్ముతున్నాడు అనుకుంటున్నారా..? ఇంకెవరు ఉన్నాడు కదా ఇప్పుడు రజినీ ఆస్థాన దర్శకుడు రంజిత్. కబాలితో ఫ్లాప్ ఇచ్చాడు ఈ కుర్ర దర్శకుడు. ఈ చిత్రం ఫ్లాప్ అయినా కూడా వెంటనే కాలాతో మరో అవకాశం ఇచ్చాడు సూపర్ స్టార్.
ఓ పక్క రజినీతో సినిమా చేయడానికి ఏళ్లకేళ్లు తపస్సు చేస్తున్నారు కొందరు దర్శకులు. కానీ రంజిత్ కు రెండుసార్లు ఆ అవకాశం వచ్చింది. అయితే రెండుసార్లు ఈయన అభిమానులను నిరాశ పరిచాడు. ఇప్పుడు విడుదలైన కాలా కూడా కమర్షియల్ గా తమిళ్ లో సేఫ్ అవుతుందేమో కానీ మిగిలిన భాషల్లో మాత్రం ఫ్లాపే.
కానీ ఇప్పుడు మూడోసారి కూడా ఈ దర్శకున్ని నమ్ముతున్నాడు రజినీ. ఈయనతో త్వరలోనే మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు రజినీకాంత్. ఈయన రాజకీయాల్లోకి వెళ్తోన్న నేపథ్యంలో వెనకబడిన జాతుల ప్రజల కష్టాలు చూపించే నాయకుడిగా రజినీ నటిస్తున్నాడు. ఇవే కథలు మళ్లీ మళ్లీ రజినీకాంత్ కు చెబుతున్నాడు రంజిత్. కబాలి.. కాలా అవే. ఇప్పుడు మరోసారి ఇలాంటి కథే చెప్పాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ చిత్రంపై ఓ క్లారిటీ రానుంది. ఇప్పటికే రెండుసార్లు నమ్మి మోసపోయిన రజినీకాంత్.. రంజిత్ ను మూడోసారి కూడా నమ్మడంపై ఆంతర్యం ఏంటో ఆయనకే తెలియాలిక..!