కొన్ని సినిమాలకు టాక్ బాగుంటుంది కానీ డబ్బులు మాత్రం రావు. అక్షయ్ కుమార్ సినిమా విషయంలో ఇదే జరిగిందిప్పుడు. రెండేళ్లుగా వరస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరోకు ప్యాడ్ మ్యాన్ బ్రేకులేసింది. ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ వచ్చేసాయి. ఇండియాలో 76 కోట్లు మాత్రమే వసూలు చేసింది ఈ చిత్రం. ఓవర్సీస్ లో కూడా 12 కోట్లతో సరిపెట్టుకుంది. అంటే కనీసం 100 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది ప్యాడ్ మ్యాన్. సినిమా అద్భుతంగా ఉంది అందులో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు కానీ కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నట్లు ప్యాడ్ మ్యాన్ ఫ్లాప్ కు కూడా చాలా కారణాలున్నాయి.
ఈ చిత్రం ఆడవాళ్ల పర్సనల్ ప్రాబ్లమ్స్.. అంటే పీరియడ్స్ ఆధారంగా తెరకెక్కించాడు దర్శకుడు బాల్కీ. అమీర్ ఖాన్ నుంచి ఆయుష్మాన్ ఖురానా వరకు.. దీపిక నుంచి హ్యూమా ఖురేషీ వరకు అంతా ఈ సినిమా కోసం ప్యాడ్స్ పట్టుకుని ప్రమోట్ చేసారు. ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కానీ ఎంత ప్రయత్నించినా.. సినిమాకు ఎంత మంచి టాక్ వచ్చినా కూడా మన ప్రేక్షకుల మైండ్ సెట్ మాత్రం ఇంకా అంతగా ఎదగలేదు. పక్కన అమ్మాయిలను కూర్చోబెట్టుకుని ఇలాంటి సినిమాలు చూసే స్థాయికి మన దేశం రాలేదింకా. అందుకే ఇలాంటి బోల్డ్ కాన్సెప్ట్ ను ప్రేక్షకులు ఒప్పుకోలేకపోతున్నారు. ఓవర్సీస్ లో కూడా ప్యాడ్ మ్యాన్ కు ఊహించిన రెస్పాన్స్ అయితే రావడం లేదు. మొత్తానికి ప్రశంసల పరంగా ప్యాడ్ మ్యాన్ తోపు అయినా కూడా పైసల దగ్గర మాత్రం వెనకబడ్డాడు.