బాలీవుడ్ లో ఇప్పుడు కొన్ని సినిమాలకు కథతో పనిలేదు.. ఆ ఫ్రాంచైజీకి ఉన్న డిమాండ్ చాలు. కథ ఉన్నా లేకపోయినా ప్రేక్షకులు చూసేస్తారు. ఈ విషయం ప్రూవ్ అయింది కూడా. ధూమ్ 3లో ఏం లేదు.. కేవలం అమీర్ ఖాన్ కోసం ఆడింది అన్నవాళ్లు లేకపోలేరు. అందులో నిజం కూడా ఉంది. ధూమ్ 2తో పోలిస్తే పార్ట్ 3 నాసీరకంగా ఉంటుంది. కథ ఉండదు. కానీ 500 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఇక క్రిష్ సిరీస్ కూడా అంతే. క్రిష్ రెండో భాగం ఉన్నట్లుగా మూడో భాగం ఉండదు కానీ ఆడేసింది. ఇప్పుడు రేస్ కూడా అంతే. రేస్ పార్ట్ 1 అదిరిపోయింది. అబ్బాస్ మస్తాన్ తెరకెక్కిం చిన ఈ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులను కూడా థ్రిల్ చేసింది. రెండో భాగానికి అంత రెస్పాన్స్ రాలేదు కానీ సినిమా ఆడింది. ఇప్పుడు మూడో భాగం వస్తుంది. తాజాగా ట్రైలర్ విడుదలైంది. సారి సల్మాన్ ఉండటంతో కథ అసలే లేదు..
కేవలం యాక్షన్ తప్ప. రెమో డిసౌజా తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేవు. సల్మాన్ ఖాన్ తో పాటు అనిల్ కపూర్, బాబీ డియోల్, జాక్వలిన్ ఫెర్నాండేజ్, డైసీ షా ఇందులో నటిస్తున్నారు. కిక్ తర్వాత సల్మాన్, జాక్వలిన్ నటిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రాన్ని రమేష్ తౌరానితో కలిసి సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్నాడు.
ట్రైలర్ తోనే అంచనాలు మరో స్థాయికి వెళ్లిపోయాయి. కచ్చితంగా పార్ట్ 1.. 2 తో పోలిస్తే ఈ మూడో భాగంతో బాక్సాఫీస్ రికార్డులకు మూడినట్లుగానే కనిపిస్తుంది. కథ కంటే కూడా యాక్షన్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు దర్శకుడు. జూన్ 15న ఈద్ కానుకగా రేస్ 3 విడుదల కానుంది. చూడాలిక.. ఈ చిత్రం ఎలాంటి సంచలనాలకు తెరతీస్తుందో..?