రాజకీయాల్లోకి మాత్రమే రాలేదు కానీ బయట ఉండి అన్ని రాజకీయాలు చేస్తున్నాడు రజినీకాంత్. ఈయన తన మార్క్ రాజకీయాలు అప్పుడే మొదలుపెట్టారు. తనకు పాలిటిక్స్ తెలియవు అంటూనే పొలిటికల్ గా ఎలా ఉండాలో ఇప్పటికే అన్నీ నేర్చుకుంటున్నారు సూపర్ స్టార్. చిరంజీవి లాంటి సూపర్ స్టార్ కూడా రాజకీయాల్లో రాణించలేకపోయాడు. దాంతో ఆయన్ని చూసి ముందే జాగ్రత్త పడుతున్నాడు రజినీకాంత్. కావాలనే రాజకీయ అరంగేట్రం గురించి ఆలస్యం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈయన పాలిటిక్స్ లోకి వస్తారా రారా అనే వాదనకు తెరదించుతూ తాజాగా ఫ్యాన్స్ తో మీటింగ్ లకు హాజరవుతున్నాడు రజినీకాంత్. అందులో దేవుడు శాసిస్తే వస్తా.. వచ్చి అందరి తాట తీస్తా అంటున్నారు. మ్యాటర్ ఏదైనా డిసెంబర్ 31న తర్వాత చెప్తానంటున్నాడు సూపర్ స్టార్.
ఈ టైమ్ లో రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నాడా..? వస్తే ఎప్పుడొస్తాడు..? ఎలా వస్తాడు..? వస్తే ఏం చేస్తాడు..? అసలు ఆయన మనసులో ఏముంది..? ఇలా ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ప్రస్తుతం తమిళనాట ఉన్నాయి. మనసు ఒకటి చెబితే.. నోరు ఒకటి చెబుతుందన్నట్లు.. రజినీ కూడా రాజకీయాల గురించి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాడు. ఆసక్తి లేదంటూనే.. మరోవైపు తను చేస్తోన్న పనులతో రాజకీయాల్లోకి వస్తున్నట్లు హింట్లు ఇస్తున్నాడు. ఇది వరకు అలవాటు లేని పనులు కూడా ఇప్పుడు చేస్తున్నాడు సూపర్ స్టార్. ఫ్యాన్స్ తో మీటింగ్ లు.. ప్రజలతో ఛాటింగ్ లు.. రైతులతో కలిసి మాట్లాడటాలు.. ఇవన్నీ కొత్తగా చేస్తోన్న పనులే.
ఇప్పుడు ఈయన ఫ్యాన్స్ తో సపరేట్ గా మీటింగ్స్ పెట్టాడు. ఇప్పటికే ఓ మీటింగ్ అయిపోయింది కూడా. ఇందులో భాగం గానే రజినీ మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటే వస్తానంటూ చెప్పాడు. ఈ మధ్య ఎక్కువగా ప్రజా సమస్యలపై కూడా దృష్టిపెట్టాడు సూపర్ స్టార్. నదుల అనుసంధానం కోసం నిరసన చేస్తున్న 16 మంది రైతుల్ని కలిసి వారికి తన మద్దత్తు తెలిపడం కానీ.. వాళ్లకు కోటి రూపాయల విరాళం అందించడం కానీ.. మోదితో మాట్లాడతా అని చెప్పడం కానీ అన్నీ రజినీ మార్క్ రాజకీయాలే. మొత్తానికి ఇక ఇప్పుడు తేలాల్సింది ఒక్కటే.. ఈయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే సొంతంగా పార్టీ పెడతారా లేదంటే ఏదైనా ఉన్న పార్టీలోనే చేరిపోతారా అనేది..!