అవునా.. రజినీకాంత్ ఏం చేసాడు..? అయినా ఆయన సినిమాను కోప్పడాల్సిన పనేముంది అనుకుంటున్నారా..? ఒక్కసారి ఆలోచించండి.. రజినీ సినిమా వస్తుంది అని చెప్తే ఆ చుట్టుపక్కల మరే సినిమా అయినా విడుదల చేస్తారా..? ఆయన సినిమా వస్తే ఆ ఇంపాక్ట్ కనీసం నెల రోజులైనా ఉంటుంది. అందుకే ఆ చుట్టుపక్కలకి కూడా ఏ నిర్మాత సాహసించడు తన సినిమా విడుదల చేయడానికి. అయితే ఆ వచ్చే తేదీ ఎప్పుడో చెప్ప కుండా ఆడుకుంటే ఎవరికి మాత్రం కోపం రాదు చెప్పండి. ఇప్పుడు 2.0 విషయంలో ఇదే జరుగుతుంది. ఓ రోజు వస్తామని.. మరోరోజు రామని ఇష్టమొచ్చినట్లు ఆడుకుంటున్నారు.
దాంతో మిగిలిన నిర్మాతలకు లైకా ప్రొడక్షన్స్ పై చాలా కోపం వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు ఈ సెగ తెలుగు ఇండస్ట్రీని కూడా తాకేసింది. జనవరి 25న వస్తాడనుకున్న రజినీ కాస్తా ఎప్రిల్ 27 అన్నారు. తర్వాత అదే తేదీ రోజు 2.0 పక్కకు జరిగి కాలా వచ్చేసింది. ఇలా ఎవరికి వాళ్లు తమకు ఇష్టం వచ్చినట్లు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తే ఎలా అని మిగిలిన నిర్మాతలు ఫైర్ అవుతున్నారు. ఏదో ఒకటి పక్కాగా రిలీజ్ డేట్ ఇవ్వండి.. దాన్ని బట్టి తమ సినిమాల విడుదల తేదీలు వాయిదా వేసుకోవడమో.. లేదంటే ముందుకు తీసుకురావడమో చేస్తామంటున్నారు తమిళ నిర్మాతలు. కానీ లైకా సంస్థ మాత్రం 2.0 విడుదల తేదీపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఎప్రిల్ నుంచి ఆగస్ట్ 15 అన్నారు.. కానీ ఇప్పుడు తీరు చూస్తుంటే దివాళికి కూడా వచ్చేలా కనిపించట్లేదు ఈ చిత్రం. అడిగితే విఎఫ్ఎక్స్ ఆలస్యం అవుతున్నాయి అంటున్నారు.
లైకా ప్రొడక్షన్స్ అంటే తనకు చాలా గౌరవం అని.. అనవసరంగా 2.0 విడుదల తేదీలను అటూ ఇటూ జరిపి రీజనల్ సినిమాల భవిష్యత్తు దెబ్బ తీయొద్దని కోరుతున్నారు నిర్మాతలు. ఆయన వచ్చే టైమ్ చెప్తే తామే సినిమాలు వాయిదా వేసుకుంటామని మర్యాదగా చెబుతున్నారు తమిళ నిర్మాతలు. ఎందుకంటే రజినీ వస్తే అందరికీ ప్రమాదమే అంటున్నారు నిర్మాతలు. 2.0 సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది. స‌్వయంగా శంకర్ నోరు విప్పి చెప్పేవరకు 2.0 విడుదల తేదీపై కన్ఫ్యూజన్ మాత్రం కంటిన్యూ కావడం ఖాయం.