పేరుకు కారెక్టర్ ఆర్టిస్ట్ కానీ రమ్యకృష్ణ తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు స్టార్ హీరోయిన్లు కూడా తీసుకోవడం లేదు. రమ్య ఇమేజ్ ముందు కుర్ర హీరోయిన్లు కూడా నిలబడలేకపోతున్నారు. ఒక్కో సినిమాకు ఆమె పారితోషికం పెరుగుతూ పోతుంది కానీ తగ్గడం లేదు. అరే.. వయసు 50కి చేరువగా ఉన్నా కూడా లెక్క మాత్రం కోటికి పైగా వెళ్తుంది. బాహుబలితో రమ్యకృష్ణ కెరీర్ మారిపోయింది.
శివగామి పాత్ర ఆమె జీవితాన్ని మార్చేసింది. దానికి ముందు సోగ్గాడే చిన్నినాయనాలో కూడా రప్ఫాడించేసింది. ఇప్పుడు రమ్యకృష్ణను తట్టుకోవడం నిర్మాతల వల్ల కావడం లేదు. ఒక్కో సినిమాకు కోటికి పైగా తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
ముఖ్యంగా శైలజారెడ్డి అల్లుడులో 30 రోజుల షెడ్యూల్ కు ఏకంగా కోటి పారితోషికం తీసుకుందని తెలుస్తుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
ఇదే సినిమాలో హీరోయిన్ గా నటించిన అను ఎమ్మాన్యువల్ పారితోషికం రమ్యకృష్ణలో సగం కూడా లేదు. దాంతోనే అర్థమైపోతుంది ఈ భామ క్రేజ్ ఏంటని..? ఇక వరుణ్ తేజ్-సాగర్ చంద్ర సినిమాలోనూ రమ్య కీలకపాత్రలో నటించబోతుంది. ఈ సినిమాకు కూడా భారీ పారితోషికం అందుకుంటుంది రమ్యకృష్ణ. మొత్తానికి హీరోయిన్ గా ఉన్నపుడు రప్ఫాడించిన రమ్య.. ఇప్పుడు అత్త.. అమ్మ అయిన తర్వాత చుక్కలు చూపిస్తుంది. మరి ఈ శివగామి దూకుడుకు బ్రేకులు వేసేది ఎవరో..?