ఒకప్పుడు రవితేజపై ఇండస్ట్రీలో ఓ రూమర్ ఉండేది. ఈయనకు కథ విని డేట్స్ తీసుకుంటే తక్కువ రెమ్యునరేషన్.. కథ వినకుండా డేట్స్ ఇస్తే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటాడు అని. ఇది అప్పట్లో విని నవ్వుకునే వాళ్లు జనాలు. ఎదుగుతున్నాడు కాబట్టి ఏడుస్తున్నారు అని సర్దుకునే వాళ్లు అభిమానులు. కానీ ఇప్పుడు రవితేజ చేస్తోన్న సినిమాలు చూస్తుంటే ఇది నిజమేనేమో అనే అనుమానం రాకమానదు. ఒకప్పుడు ఏడాదికి మూడు సినిమాలు చేస్తే అందులో కనీసం ఒక్కటైనా హిట్ అయ్యేది.
మరో రెండు ఫ్లాప్ అయినా ఎంటర్ టైన్మెంట్ ఉండేవి. కానీ ఇప్పుడు రవితేజ సినిమాల్లో అసలు కథే కనిపించడం లేదు. మొన్న విడుదలైన టచ్ చేసి చూడు కానీ.. ఇప్పుడు వచ్చిన నేలటికెట్ లో కానీ అసలు కథ ఎక్కడుంది..? ఏదో హీరోయిజంతో సినిమాను నడిపించేయాలనే ఆరాటం తప్ప. మరోవైపు ఇప్పుడు రవితేజ రెమ్యునరేషన్ పై కూడా ఇండస్ట్రీలో వార్తలు బాగానే వినిపిస్తున్నాయి.
గతేడాది రాజా ది గ్రేట్ కోసం ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం 3 కోట్లే అని అప్పట్లో వినిపించిన వార్త. ఎందుకంటే అక్కడ ఉన్నది దిల్ రాజు కాబట్టి. కానీ టచ్ చేసి చూడుకు కానీ.. నేలటికెట్ కు గానీ ఈయన భారీ పారితోషికం తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ తో వరసగా రెండు సినిమాలు కమిటయ్యాడు మాస్ రాజా. ఈ రెండింటికి 16 కోట్ల ప్యాకేజ్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదే నిజం అయితే సంచలనమే. ఎందుకంటే ఒకప్పుడు ఈయన మార్కెట్ 30 కోట్లుండేది. కానీ ఇప్పుడు 10 కోట్ల మార్క్ కూడా అందుకోవడం లేదు. టచ్ చేసి చూడు లైఫ్ టైమ్ షేర్ 9 కోట్లకు కాస్త ఎక్కువ.. ఇప్పుడు నేలటికెట్ కూడా అంతే. ఇలాంటి టైమ్ లో ఈయనకు సినిమాకు 8 కోట్లు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. మరి చూడాలిక.. నిజంగానే రవితేజతో సినిమా చేయాలని చేస్తున్నారా.. లేదంటే ఈయన ఇప్పటికీ స్టార్ అనే భ్రమల్లోనే అన్నేసి కోట్లు ఇస్తున్నారా అనేది..?