అదేంటి.. లౌక్యం సినిమా రీమేక్ ఏంటి.. సొంత కథే కదా.. ఇక్కడ కోనవెంకట్ అండ్ బ్యాచ్ కలిసి చేసిన సూపర్ కామెడీ ఎంటర్టైనర్ లౌక్యం కదా.. మళ్లీ ఈ అనుమానం ఇప్పుడు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా..? మన లౌక్యం స్ట్రెయిట్ సినిమానే కానీ ఇప్పుడు తమిళనాట సంతానం హీరోగా నటిస్తున్న సక్క పోడుపోడు రాజా సినిమాపై ఇప్పుడు అనుమానం అంతా. ఈ చిత్రం ట్రైలర్ చూస్తుంటే ఇది లౌక్యం సినిమాకు రీమేక్ గా అనిపిస్తుంది. కానీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం నాదే అంటూ ఆ సినిమా దర్శకుడు సేతురామన్ టైటిల్స్ పై వేసుకున్నాడు. అంటే లౌక్యం కథను కాజేసారు అనుకోవాలా.. లేదంటే కాపీ అనకుండా ఇన్ స్పైర్ అయ్యారని క్లాస్ గా చెబుతున్నారా అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. సంతానంకు ఇప్పుడు టైమ్ పెద్దగా బాగోలేదు. మనోడు హీరోగా నిలబడ్డానికి ఇంకా టైమ్ పట్టేలా ఉంది. ఈయన తొలి విజయం వల్లవనక్కు పుల్లు ఆయుధంతో అందుకున్నాడు. ఈ చిత్రం మర్యాద రామన్నకు రీమేక్.
ఇక ఇప్పుడు సక్క పోడు పోడు రాజా సినిమాలో హీరోగా నటిస్తున్నాడు సంతానం. ఇది లౌక్యం సినిమాకు రీమేక్. ఈ సినిమాకు శింబు సంగీతం అందించడం విశేషం. ఇందులో సంతానం లుక్ చూసి షాక్ అయిపోక తప్పదు. ఎందుకంటే స్టార్ హీరోల కంటే స్టైల్ గా మారిపోయాడు ఈయన. ఈ మధ్యే సక్క పోడుపోడు రాజా ఆడియో విడుదలైంది.. ఈ చిత్రం అప్పటి వరకు ఓ తెలుగు సినిమాకు రీమేక్ అనే విషయం ఎవరికీ తెలియదు కానీ ట్రైలర్ చూసిన తర్వాతే అర్థమైంది.. వీళ్లు లౌక్యం సినిమాను తీసేసుకున్నారని. 2014లో వచ్చిన లౌక్యం గోపీచంద్ కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే సినిమాను తన కెరీర్ కోసం వాడేసుకుంటున్నాడు సంతానం. సేతురామన్ తెరకెక్కిస్తోన్న సక్క పోడుపోడు రాజాలో ఆల్ట్రామోడ్రన్ గా కనిపిస్తున్నాడు సంతానం. డిసెంబర్ 22న ఈ చిత్రం విడుదల కానుంది. మరి లౌక్యంగా సంతానం హిట్ కొడతాడో లేదో చూడాలిక..!