ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఆలోచన శైలిని మార్చేసింది. నిన్నమొన్నటి వరకు బయోపిక్ అంటే భయపడేవాళ్లు మన దర్శకులు. నిజ జీవితాన్ని తెరపై చూపించాలంటే అమ్మో భయం అనుకునేవాళ్లు. కానీ సావిత్రి జీవితాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కించిన తీరు..
మహానటి సాధించిన విజయం చూసి ఇప్పుడు అందరిలోనూ ఆత్మ విశ్వాసం పెరిగిపోయింది. మహానటి ఇచ్చిన ఉత్సాహంలో మరిన్ని బయోపిక్స్ కూడా తెలుగులో తెరకెక్కడానికి సిద్ధంగా ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ చేస్తానంటూ చాలా రోజులుగా బాలయ్య చెప్తూనే ఉన్నాడు. ఇది అక్టోబర్ తర్వాత పట్టాలెక్కనుంది. ఆ లోపు వినాయక్ సినిమా పూర్తి చేయనున్నాడు ఈ హీరో. పెద్దాయన బయోపిక్ పక్కనబెడితే ఏఎన్నార్ బయోపిక్ చాలా సైలెంట్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లో సిద్ధమవుతుందని తెలుస్తుంది.
ఇక ఇప్పుడు శ్రీదేవి బయోపిక్ పై ఎక్కడలేని ఆసక్తి మొదలైంది. ఈ చిత్రం రావాలంటే చాలా అడ్డంకులు దాటుకోవాలి. ఇక శ్రీదేవితో పాటు సౌందర్య బయోపిక్ కూడా వార్తల్లో ఉంది. పెళ్లిచూపులు లాంటి సంచలన సినిమా నిర్మించిన రాజ్ కందుకూరి సౌందర్య బయోపిక్ పై ఆసక్తి చూపిస్తున్నాడు. అయితే సౌందర్య బయోపిక్ లో చెప్పుకోదగ్గ అంశాలైతే ఏం లేదు. మరి చూడాలిక.. మహానటి పుణ్యమా అని మరెన్ని జీవితాలు వెండితెరపై ఆవిష్కృతం అవుతాయో..?