“బిచ్చగాడు” లాంటి సూపర్ సక్సెస్ అనంతరం తన ప్రతి చిత్రంతో స్టార్ డమ్ తోపాటు క్రేజ్ & మార్కెట్ ను కూడా పెంచుకుంటూ వెళ్తున్న యువ కథానాయకుడు విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం “ఇంద్రసేన”. జి.శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ రైట్స్ ను భారీ పోటీ నడుమ ఆంధ్రప్రదేశ్/తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్.కె.ఆర్ ఫిలిమ్స్ అధినేత నీలం కృష్ణారెడ్డి సొంతం చేసుకొన్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్-ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేయగా.. ప్రేక్షకులు “ఇంద్రసేన” కోసం ఎదురుచూస్తున్నారు. తమిళనాట ఈ చిత్రం “అన్నాదురై”గా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా నీలం కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. “”బిచ్చగాడు” కంటే బిగ్గెస్ట్ హిట్ అవ్వగల స్థాయి కంటెంట్ ఉన్న సినిమా “ఇంద్రసేన”, ఆ నమ్మకంతోనే భారీ మొత్తం చెల్లించి ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకొన్నాం. నవంబర్ 16న హైద్రాబాద్ లో భారీ స్థాయిలో ఆడియో వేడుకను నిర్వహించి.. అదే సందర్భంలో సినిమాలో ఓ పది నిమిషాల నిడివి ఫుటేజ్ ను ప్లే చేయడంతోపాటు.. ఓ ఫుల్ వీడియో సాంగ్ ను కూడా ఆరోజు ప్రదర్శించనున్నాం. ఆ వీడియో సాంగ్ ను మాస్ మహారాజా రవితేజ లాంచ్ చేస్తారు. మా సంస్థ నుంచి విడుదలైన మునుపటి చిత్రాలు “ఇంకొక్కడు, జయమ్ము నిశ్చయమ్మురా” తరహాలో “ఇంద్రసేన” కూడా ఘన విజయం సొంతం చేసుకొని హ్యాట్రిక్ హిట్ అందుకొంటామన్న నమ్మకం ఉంది” అన్నారు.
విజయ్ ఆంటోనీ, డయానా చంపిక, మహిమ, జ్యూవెల్ మేరీ “ఇంద్రసేన”లో కీలకపాత్రలు పోషిస్తున్నారు.