ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే అని ఆ మధ్య నాని ఓ పాట పాడాడు కదా.. ఇప్పుడు దర్శకుడు వినాయక్ కు ఇది సరిగ్గా సూట్ అవుతుంది. జులైలో సినిమా మొదలుపెట్టి.. దసరాకు విడుదల చేస్తాం.. బాలయ్య కూడా సిద్ధంగా ఉన్నాడు.. ఫ్యాక్షన్ కథ చేస్తున్నాం.. అంతా రెడీ అయిందని ఆ మధ్య స్టేట్మెంట్స్ ఇచ్చాడు వినాయక్.
తీరా సీన్ కట్ చేస్తే.. జూన్ అయిపోయింది జులై కూడా అయిపోవడానికి వస్తుంది.. ఇప్పుడు వినాయక్ సీన్ లోనే కనిపించడం లేదు. అన్నింటికీ మించి ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కింది. దాంతో ఇప్పట్లో వినాయక్ సినిమా పట్టాలెక్కేలా కనిపించడం లేదు. ఈ టైమ్ లో వినాయక్ తో సినిమా సేఫ్ కాదని భావించాడు బాలయ్య. ఎందుకంటే ఈయనకు ఈ మధ్య వరస ప్లాపులొచ్చాయి. అఖిల్.. అల్లుడుశీను.. ఇంటిలిజెంట్ సినిమాలు ఈయన ఇమేజ్ ను బాగానే దెబ్బతీసాయి.
మధ్యలో ఖైదీ నెం. 150 ఆడినా కూడా అది చిరు మేనియాలో కలిసిపోయింది. దాంతో వినాయక్ కు తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇదే పని కోసం బాలయ్యను నమ్ముకుంటే.. ఆయన కూడా ఈయన్ని పక్కనబెట్టేసి ఎం చక్కా నాన్న సినిమా మొదలుపెట్టాడు. క్రిష్ దర్శకత్వంలో ఆగస్ట్ నుంచి అనుకున్న ఎన్టీఆర్ బయోపిక్ కాస్తా ఇప్పుడే మొదలైపోయింది.
జులై 5 నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. సూపర్ ఫాస్ట్ గా ఈ చిత్ర షూటింగ్ కూడా జరుగుతుంది. విద్యాబాలన్ కూడా సెట్ లో అడుగుపెట్టింది. క్రిష్ జోరు చూస్తుంటే మరో ఆర్నెళ్ల వరకు బాలయ్యను ఎక్కడికి వెళ్లనిచ్చేలా లేడు. జనవరిలో విడుదల కాబట్టి వినాయక్ వైపు కనీసం బాలయ్య ఆలోచించుకునే టైమ్ కూడా దొరకట్లేదు ఇప్పుడు.