ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లైనా ఇప్పటికీ స్టార్ హీరో హోదా సంపాదించుకోలేదు విష్ణు. కావాల్సినంత బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా అదృష్టమే చిన్నచూపు చూస్తుంది ఈ హీరోను. ఇన్నాళ్లూ ఒకటి అరా సినిమాలతో పలకరించిన విష్ణు.. ఇప్పుడు మాత్రం టాప్ గేర్ లో ఉన్నాడు. ఒకేసారి రెండు సినిమాలతో వస్తున్నాడు ఈ హీరో. పైగా అన్నింటికీ పర్ ఫెక్ట్ సెంటిమెంట్ లను తోడు తెచ్చుకుంటున్నాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా.. సెంటిమెంట్లు మాత్రం బాగా బలంగా పని చేస్తాయి. ఇక్కడ సెంటిమెంట్ కు పడిపోని హీరోలు ఉండరు. దీనికి మంచు విష్ణు కూడా మినహాయింపు కాదు. ఇప్పుడు ఈయన కూడా ఓ సెంటిమెంట్ వెంట బెట్టుకొస్తున్నారు. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని విష్ణు.. ఆచారి అమెరికా యాత్ర అంటున్నాడు. జి నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సమ్మర్ లో విడుదల కానుంది.
ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది.. సినిమా ఎంత కామెడీగా ఉండబోతుందో అని.. ఇక్కడే విష్ణు సెంటిమెంట్ దాగుంది. ఇప్పటి వరకు సీరియస్ సినిమాలు చేసినప్పుడైనా విష్ణు మోసపోయాడేమో కానీ కామెడీని నమ్ముకున్న ప్రతీసారి దాదాపు విజయం సాధించాడు. విష్ణు కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలుగా ఉన్న ఢీ.. దేనికైనా రెడీ.. దూసుకెళ్తా.. ఆడోరకం ఈడోరకం లాంటి సినిమాల్లో కామెడీదే పై చేయి. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈ హీరో. మరోసారి కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ తో కడుపులు చెక్కలు చేయడానికి వచ్చేస్తున్నాడు మంచు వారబ్బాయి. ఈ చిత్రంతో పాటు కొత్త దర్శకుడు కార్తిక్ తో ఓటర్ సినిమా చేస్తున్నాడు విష్ణు. ఇది రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా. ఈ సినిమా కచ్చితంగా తన కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచి పోతుందని చెబుతున్నాడు విష్ణు. ఈ ఏడాదే రెండు సినిమాలు రానున్నాయి. ఈ సినిమాలతో కచ్చితంగా తన కెరీర్ మారిపోతుందని ఆశిస్తున్నాడు మంచు వారబ్బాయి.