ఇటు ప్రేక్షకుల్లో కానీ.. అటు ఇండస్ట్రీలో కానీ హీరోల తనయులు వస్తున్నారంటే ఏదో తెలియని ఇమేజ్ ఒకటి వర్కవుట్ అవుతుంది. వాళ్లకు తొలి సినిమా నుంచే ఆదరణ మరోలా ఉంటుంది. టాలెంట్ ఉంటే నిలబడిపోతాడు. లేదంటే తొలి సినిమా తర్వాత కనబడకుండా పోతాడు. అయితే సక్సెస్ రేట్ మాత్రం హీరోల తనయులకే ఎక్కువగా ఉంటుంది. వాళ్లకు అది వరం.. శాపం కూడా. బాధ్యత ఎక్కువగా ఉంటుంది కదా.
అయితే హీరోల వారసులతో పోలిస్తే దర్శకులు, నిర్మాతల తనయులకు మాత్రం సక్సెస్ రేట్ చాలా తక్కువ. వచ్చినా వాళ్లలో నిలబడింది స్టార్లుగా మారింది చాలా అంటే చాలా తక్కువ. ఇప్పుడున్న ఇండస్ట్రీలో రామానాయుడు తనయుడు వెంకటేశ్.. అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్.. రాజేంద్రప్రసాద్ తనయుడు జగపతిబాబు మాత్రమే స్టార్స్ అయ్యారు. అల్లరి నరేష్ లాంటి వాళ్లు నిలబడ్డారు కానీ స్టార్స్ కాలేదు. ఇక ఇప్పుడు తాను ఉన్నానంటూ ముందుకొస్తున్నాడు ఆకాశ్ పూరీ.
ఈయన దర్శకత్వం వైపు వెళ్తాడేమో అనుకుంటే..
కాదని హీరోగా వచ్చేస్తున్నాడు. 20 ఏళ్లు కూడా లేని ఈ కుర్రాడు మెహబూబా సినిమాతో హీరో అయ్యాడు. పూరీ జగన్నాథ్ ప్రత్యేకంగా తన కొడుకు కోసం ఇండో పాకిస్థాన్ కథ రాసుకుని మరీ తీసాడు మెహబూబా. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. పూరీ పాత కథల మాదిరి లేదు ఇది. కచ్చితంగా తనయుడి కోసం ఆలోచించి మరీ రాసుకున్నాడు అందుకే మెహబూబా బాగా కొత్తగా కనిపిస్తుంది. పైగా ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేస్తున్నాడు.
ఇది ఇంకాస్త అంచనాలు పెంచేస్తుంది. ఇవన్నీ పక్కనబెడితే ఆంధ్రాపోరీలో చిన్న పిల్లాడిలా కనిపించిన ఆకాశ్.. ఇప్పుడు మాత్రం హీరోగా మారిపోయాడు. ఈ కుర్రాన్ని చూస్తుంటే తెలుగు ఇండస్ట్రీకి మరో హీరో దొరికినట్లే అనిపిస్తుంది. మెహబూబా కానీ హిట్టైందంటే కచ్చితంగా ఆకాశ్ కూడా తన ఉనికి చాటుకోవడం ఖాయం. మరి చూడాలిక.. ఆకాశ్ కూడా వెంకటేశ్, బన్నీ లిస్ట్ లో చేరుతాడో లేదో..?