ఈ వారం చాలా సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో గూఢచారితో పాటు చిలసౌ సినిమాలకు టాక్ బాగా వచ్చింది. ఈ రెండు సినిమాల్లోనూ తనదైన ముద్ర వేసాడు వెన్నెల కిషోర్. రెండింట్లో అద్భుతమైన పాత్రల్లో నటించాడు. గూఢచారిలో అయితే కామెడీతో పాటు తనలోని విలన్ ను కూడా పరిచయం చేసాడు. ఇండస్ట్రీలో ఒక్కొక్కరికీ ఒక్కోసారి టైమ్ నడుస్తుంది. ఇప్పుడు చూస్తుంటే వెన్నెల టైమ్ బాగా గట్టిగా నడుస్తున్నట్లే అనిపిస్తుంది. డిఫెరెంట్ మాడ్యులేషన్.. మొహంలో కనిపించే ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్.. మధ్యమధ్యలో విచిత్రమైన ఇంగ్లీష్ పదాలు.. అద్భుతమైన కామెడీ టైమింగ్.. ఇవన్నీ వెన్నెల కిషోర్ సొంతం.
అప్పుడెప్పుడో వెన్నెల సినిమాతో పరిచయం అయిన కిషోర్.. ఆ తర్వాత స్టార్ కమెడియన్ గా మారడానికి చాలా టైమ్ పట్టింది.
ఇప్పుడు ఏ తెలుగు సినిమాలో చూసినా వెన్నెల కిషోర్ ఉండాల్సిందే. ఆయన కోసమే కారెక్టర్లు రాస్తున్నారు దర్శకులు. ఈయన కూడా అదే రేంజ్ లో ఆ పాత్రలకు న్యాయం చేస్తున్నాడు. ఈయన లేకుండా సినిమా చేయడమే మానేసారు దర్శకులు. చిన్నా పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాల్లో వెన్నెల కిషోర్ కచ్చితంగా ఉండాల్సిందే.
లేకపోతే కామెడీ పండట్లేదు. పైగా వెన్నెల కిషోర్ కూడా రొటీన్ కామెడీతో కాకుండా కాస్త కొత్తగా ట్రై చేస్తున్నాడు. గతేడాది వచ్చిన రారండోయ్ వేడుక చూద్దాం, కేశవ, అమీతుమీ, మహానుభావుడు సినిమాల్లో వెన్నెల కిషోర్ దే కీ రోల్. ఏడాది మొదట్లో విడుదలైన ఛలోలో అయితే సెకండాఫ్ ను పూర్తిగా వెన్నెల కిషోర్ నిలబెట్టాడు.
ఇగోయిస్టిక్ అండ్ సాడిస్టిక్ రోల్ లో వెన్నెల కిషోర్ అందులో కడుపులు చెక్కలు చేసాడు. ఈ పాత్రలో వెన్నెల కిషోర్ ను తప్ప మరో నటున్ని ఊహించుకోలేం అన్నంతగా ఒదిగిపోయాడు కిషోర్. ఇక గతేడాది వచ్చిన ఆనందో బ్రహ్మలో రే చీకటి.. చెవిటి వాడిగా దెయ్యాల ముందు వెన్నెల కిషోర్ చేసిన కామెడీ కడుపులు చెక్కలు చేస్తుంది. ఈ పాత్రలో రప్ఫాడించాడు వెన్నెల కిషోర్. సెకండాఫ్ లో ఈయన చేసిన కామెడీనే సినిమా రేంజ్ ను పెంచేసింది. అంతేకాదు.. స్టార్ హీరోలు కూడా పట్టుబట్టి మరీ వెన్నెల కిషోర్ కామెడీ కోరుకుంటున్నారు. ఇప్పుడు గూఢచారి.. చిలసౌతో మనోడి రేంజ్ మరింత పెరిగిపోవడం ఖాయం.