ప్రయోగాలు చేయడానికి నాగార్జున ఎప్పుడూ ముందే ఉంటాడు. కొత్త కథలు వస్తే కచ్చితంగా ముందుంటాడు ఈ హీరో. కెరీర్ మొదట్నుంచీ నాగ్ చేస్తోన్నది ఇదే. దర్శకుడు కొత్త పాత అని చూడడు. కథ నచ్చితే ముందడుగు వేస్తాడు. ఇలాగే ఈ మధ్య కాలంలో ఓ కథ విషయంలో మాత్రం నచ్చి కూడా వెనకడుగు వేసాడు నాగార్జున. అదే వైఎస్ఆర్ బయోపిక్. అవును.. ఈ చిత్రంలో ముందు నాగార్జునను నటింపచేయాలనే ప్రయత్నాలు జరిగాయి. కానీ నాగార్జున మాత్రం దీనికి ఒప్పుకోలేదు. సున్నితంగా తిరస్కరించాడు. దానికి కారణం కూడా లేకపోలేదు. వైఎస్ బయోపిక్ లో నటిస్తే ఇప్పుడు లేనిపోని ఇబ్బందులు వస్తాయని ముందుగానే ఊహించాడు నాగ్. ఓ పార్టీకే పరిమితం కావాల్సి వస్తుందని.. అసలు తనకు రాజకీయాలే పడవని అందుకే నాగార్జున ఈ చిత్రాన్ని దూరం పెట్టాడని తెలుస్తుంది.
నాగార్జున వద్దన్న తర్వాతే మళయాల మెగాస్టార్ మమ్ముట్టి దగ్గరికి ఈ స్క్రిప్ట్ వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్ర స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది. ఇప్పటికే ఈ కథ మమ్ముట్టికి చెప్పడం.. ఆయన మూడు భాషల్లో నటించడానికి ఒప్పుకోవడం కూడా జరిగిపోయాయి. వైఎస్ఆర్ బయోపిక్ కు యాత్ర అనే టైటిల్ పరిశీలనలో ఉంది. తాజాగా మమ్ముట్టిని కలిసి పూర్తిస్థాయి స్క్రిప్ట్ వినిపించాడు దర్శకుడు రాఘవ. ఈ స్టిల్ ను కూడా మీడియాకు విడుదల చేసారు. త్వరలోనే రాజశేఖర్ రెడ్డి బయోపిక్ పట్టాలెక్కనుంది. వైఎస్ బయోపిక్ లో పాదయాత్రను హైలైట్ చేస్తున్నారని తెలుస్తుంది. అది అతడి జీవితాన్నే మార్చేసింది. దానికితోడు వైఎస్ఆర్ జీవిత అంతరంగం గురించి ఇందులో చూపించబోతున్నాడు దర్శకుడు. మరి ఇందులో జగన్ గా ఎవరు నటిస్తారు.. మిగిలిన పాత్రల్లో ఎవరు నటించబోతున్నారు.. వైఎస్ బయోపిక్ అంటే చంద్రబాబు పాత్రను కచ్చితంగా పెట్టాల్సిందే. మరి ఆ పాత్రలో ఎవరు నటించబోతున్నారు..? ఇవన్నీ ప్రస్తుతానికి సస్పెన్స్. మొత్తానికి మరి చూడాలిక.. వైఎస్ఆర్ బయోపిక్ ఎలా ఉండబోతుందో..?