ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్లైంది.. హీరోగా వచ్చాడు.. నటుడిగా మారాడు.. రైటర్ గా ఎదిగాడు.. ఇప్పుడు దర్శకుడిగా వస్తున్నాడు.. ఆయనే వక్కంతం వంశీ. రియల్ లైఫ్ లో ఇన్ని రోల్స్ చేసినా.. ఈయన చివరి గోల్ మాత్రం దర్శకుడు కావడమే. ఈయన కంటే తర్వాత వచ్చిన వాళ్లు.. ఈయన దగ్గర స్క్రిప్ట్ అసిస్టెంట్లుగా పనిచేసిన వాళ్లకు కూడా మెగాఫోన్ పట్టారు.
కానీ వక్కంతంకు మాత్రం ఆ ఛాన్స్ ఆలస్యమవుతూనే వచ్చింది. కొన్నేళ్లుగా తన కథలు స్టార్ హీరోలకు ఇస్తూనే ఉన్నాడు వంశీ. ఈయన రాసిన కథల్లో కొన్ని బ్లాక్ బస్టర్లు ఉన్నాయి.. కొన్ని ఫ్లాపులు ఉన్నాయి. కానీ కామన్ గా స్టార్స్ అందరితోనూ ఫ్రెండ్ షిప్ అయితే ఉంది. ఎప్పటికైనా ఎన్టీఆర్ సినిమాతోనే దర్శకుడిగా మారతానంటూ చాలాసార్లు చెప్పాడు వంశీ.
కానీ తను నమ్మిన ఎన్టీఆర్ హ్యాండిచ్చాడు. అయితే బన్నీ మాత్రం చేరదీసాడు. నా పేరు సూర్యతో ఈయన దర్శకుడిగా మారి.. తన సత్తా చూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
ఈ సినిమా మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు వచ్చిన పాటలకు.. ట్రైలర్ కు అయితే రెస్పాన్స్ అదిరిపోయింది. పైగా బన్నీ కూడా ఇప్పుడు ఫామ్ లో ఉండటం.. కమర్షియల్ అంశాలు అంటూ లెక్కలేసుకోకుండా వంశీ కూడా ఓ సిన్సియర్ అటెంప్ట్ చేయడం ఈ చిత్రానికి కలిసిరానుంది. ఈ మధ్య మంచి సినిమాలు వచ్చినపుడు ప్రేక్షకులు కాదనకుండా చూస్తున్నారు. రంగస్థలంతో పాటు భరత్ అనే నేను కూడా దీనికి నిదర్శనం.
దాంతో తన సినిమా కూడా ఆడుతుందనే నమ్మకతోనే ఉన్నాడు ఈ దర్శకుడు. ఇన్నాళ్లూ దర్శకుడిగా మారాలన్న కసి ఇప్పుడు ఆ సినిమాలో కనిపిస్తుంది. మొత్తానికి చూడాలిక.. రైటర్ గా సంచలనాలు సృష్టించిన వక్కంతం వంశీ.. ఇప్పుడు దర్శకుడిగా ఏం చేస్తాడో..?