మెగా ఫ్యామిలీ అనేది ఓ మహావృక్షం. అందులోంచి చాలా మంది హీరోలు వచ్చారు. అరడజన్ కంటే పైనే అక్కడ హీరోలున్నారు.. నలుగురు స్టార్స్ ఉన్నారు. చిరంజీవి ఆల్ టైమ్ నెంబర్ వన్.. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. అల్లుఅర్జున్ ఫామ్ లోనే ఉన్నాడు.. ఇక రామ్ చరణ్ కు సైతం సూపర్ స్టార్ డమ్ ఉంది. ఇలాంటి టైమ్ లో వరుణ్ తేజ్, సాయిధరంతేజ్ కూడా ఆ కుటుంబం నుంచి వచ్చారు. వీళ్లలో సాయి స్టార్ అయ్యేలా కనిపించాడు కానీ ఇప్పుడు ఆయన ఇమేజ్ దారుణంగా పడిపోయింది. వరసగా ఐదు ఫ్లాపులతో రేస్ నుంచి తప్పుకున్నాడు మెగా మేనల్లుడు. అర్జంట్ గా ఓ హిట్ పడితే కానీ సాయి కెరీర్ గాడిన పడదు. ఈ టైమ్ లో వరుణ్ తేజ్ మాత్రం గతేడాది ఫిదా.. ఇప్పుడు తొలిప్రేమ లాంటి బ్లాక్ బస్టర్స్ తో దారిన పడ్డాడు. ఫిదా బ్లాక్ బస్టర్ అయింది కానీ ఇది వరుణ్ వల్లే ఆడిన సినిమా అని చెప్పుకోడానికి ఒక్కటి కూడా లేదు. ఆ ఇమేజ్ ఈ కుర్ర హీరోకు రాలేదు. సాయిపల్లవి పూర్తిగా డామినేట్ చేసి ఫిదాను ఫీమేల్ ఓరియెంటెడ్ చేసేసింది.
ఈయన నటించిన తొలిప్రేమ ఇప్పుడు కేవలం వరుణ్ తేజ్ ఇమేజ్ వల్లే ఆడుతుంది. మంచి ప్రేమ కథకు వరుణ్ క్రేజ్ తోడైంది. దాంతో కలెక్షన్లు కుమ్మేస్తుంది ఈ చిత్రం. పైగా ఈ చిత్రంలో డాన్సులు కూడా బాగానే వేసాడు మెగా ప్రిన్స్. శేఖర్ మాస్టర్ పుణ్యమా అని మంచి స్టెప్పులు వేసాడు. కెరీర్ లో తొలిసారి కాలు కదిపాడు.. చెమట చిందించాడు. అలవాటు లేని కష్టమైన స్టెప్పులు కూడా వేసాడు మెగా ప్రిన్స్. తొలిప్రేమలోనే కాదు.. ఇప్పట్నుంచీ ప్రతీ సినిమాలో వచ్చినట్లు డాన్సులు వేస్తానంటున్నాడు వరుణ్ తేజ్. పైగా తాను బన్నీ, చరణ్ లాంటి డాన్సర్ ను కాదని.. వచ్చినట్లు వేస్తుంటాను.. క్షమించండి అంటూ అభిమానులకు చెప్పుకున్నాడు కూడా ఈ మెగా రాజకుమారుడు. తొలిప్రేమ మూడు రోజుల్లోనే 15 కోట్ల మార్క్ అందుకుంది. సంకల్ప్ రెడ్డితో తర్వాతి సినిమా చేయబోతున్నాడు వరుణ్ తేజ్. ఇది తెలుగులో తెరకెక్కబోయే తొలి స్పేస్ సినిమా. ఇప్పటికే తమిళనాట టిక్ టిక్ టిక్ తెరకెక్కింది. ఇప్పుడు వరుణ్ ఇదే ప్రయోగం చేయబోతున్నాడు.