ఇంకా కొన్ని గంటలే.. ఇంకొన్ని నిమిషాలే.. 50 ఏళ్లుగా ప్రేక్షకుల మదిలో గూడు కట్టుకున్న ఆ అందాల రాశి రూపం కళ్ల ముందు కనిపించేది ఇంకా కొన్ని గంటలే. ఇక ఎప్పటికీ ఎవరికీ కనిపించనంత దూరం వెళ్లిపోతుంది శ్రీదేవి. ఇప్పటికే లోకాన్ని విడిచి నాలుగు రోజులు అయినా దుబాయ్ లో చనిపోవడంతో కాస్త ఆలస్యంగా ఆమె భౌతికకాయం ముంబైకి వచ్చింది. వచ్చీ రాగానే అభిమానుల తాకిడి.. సినీ ప్రముఖులతో ముంబైలోని శ్రీదేవి ఇళ్లు భావోద్వేగంతో కూడిన ప్రదేశంగా మారిపోయింది. ఇప్పటికే శ్రీదేవి భౌతికకాయాన్ని ఇంటి నుంచి సెలెబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్ కు తీసుకెళ్లారు. అక్కడే అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం 12.30 వరకు ఉంచనున్నారు.
ఆమెను చూడ్డానికి వేలాది మంది అభిమానులు పుష్పగుచ్చాలతో క్లబ్ బయట ఎదురుచూపులు చూస్తున్నారు. తమ అభిమాన తారను కడసారి చూడాలని భాదత్రప్త హృదయాలతో మౌనంగా రోదిస్తున్నారు. శ్రీదేవి అంతిమయాత్ర మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రారంభమవుతుంది. అంత్యక్రియలు విలే పార్లె సేవా సమాజ్ క్రిమిటో రియంలో సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంతకుముందు శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబై లోని తన ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఎయిర్ పోర్ట్ నుంచి మీడియాకు కనిపించకుండానే ప్రత్యేక అంబులెన్స్ లో తీసుకొచ్చారు. కనిపిస్తే అభిమానుల తాకిడి తట్టుకోలేమని ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు. మొత్తానికి ఏదేమైనా ఇంకా కొన్ని గంటల్లో ఆ దేవి రూపం ఇక ఎప్పటికీ కనిపించకుండా వెళ్లిపోతుంది.